
- గాంధీభవన్ లో మల్లురవి అధ్యక్షతన పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ
హైదరాబాద్, వెలుగు: పీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశమైంది. శుక్రవారం గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సాగిన ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. వరంగల్ జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులను, అక్కడి పార్టీ పరిస్థితిపై కమిటీకి వివరించారు. సోమవారం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. అదేరోజున వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు. ఈ సమావేశంతో వరంగల్ జిల్లా నేతల మధ్య కొనసాగుతున్న విబేధాలకు ఫుల్ స్టాప్ పడనుందని పీసీసీ భావిస్తోంది.
క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో పార్టీలోని ఏ ఎమ్మెల్యే కూడా మరో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయలేదని, తన భేటీలో కూడా ఈ ప్రస్తావనే రాలేదన్నారు. తమ జిల్లా నేతల మధ్య చిన్న, చిన్న బేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, వాటిని పెద్దగా చూపి ప్రచారం చేయడం సరికాదన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.