
దేవరకొండ, వెలుగు: రాబోయే రోజుల్లో రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. గురువారం ఉమ్మడి చందంపేట మండల పరిధిలోని పోగిళ్ల గ్రామంలో రూ. 3.50 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతకాలంగా ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను తొలగించేందుకే ఈ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం పోగిళ్ల,పాతకంబాలపల్లి,ఉస్మాన్ కుంట ,బొల్లారం గ్రామాల్లో రూ. 3.67 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాచరాజుపల్లి గ్రామ సమీపంలో కొండపై కొలువైన బర్మా వెంకటేశ్వర స్వామిని స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు