బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కవిత సస్పెన్షన్ : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కవిత సస్పెన్షన్ : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
  • కేసీఆర్ కు కూతురైనా, కార్యకర్తైనా పార్టీలో సమానమే
  • మోదీ, రేవంత్, బాబు కుట్రలో  భాగంగానే సీబీఐకి అనుమతి
  • కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండమే
  • జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి కామెంట్స్

జనగామ, వెలుగు : బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ​ నుంచి సస్పెండ్ చేసినట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన జనగామలో పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని హాట్​ కామెంట్స్​చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటి వారిపైనైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. 

పార్టీ అధినేత కేసీఆర్ కు బిడ్డైనా, కార్యకర్తైనా సమానమేనన్నారు. అందుకే తన బిడ్డ అని కూడా చూడకుండా కవితను సస్పెండ్ చేశారన్నారు. తెలంగాణ సాధించి పెట్టిన కేసీఆర్​పై సీబీఐని ఎగదోస్తూ అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ శ్రేణులంతా ఆవేదనకు గురవుతుంటే, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా కవిత మరింత నష్టం కలిగించేలా మాట్లాడడం శోచనీయమన్నారు. 

పార్టీ కీలక నేతలను కించపరిచి ఇబ్బంది పెట్టేలా వ్యవహరించినందునే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని కార్తకర్తలంతా ముక్తకంఠంతో స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సీబీఐ అనుమతిలో ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్​ రెడ్డిల కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్​ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్​ సర్కారే వస్తుందన్నారు.  ఈ సమావేశంలోపార్టీ లీడర్లు పోకల జమున, బాల్దె సిద్ధిలింగం, గాడిపల్లి ప్రేమలతా రెడ్డి, గద్దల నర్సింగారావు, బండ పద్మ యాదగిరి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.