
- ఆర్థిక మూలాల కూపీ లాగుతున్న సెంట్రల్ ఏజెన్సీ
- ఇప్పటికే రెండు రోజులపాటు రోహిత్‌రెడ్డిని విచారించిన ఆఫీసర్లు
- రోహిత్‌రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఆరా.. 27న మరోసారి విచారణ
- నందు, రోహిత్ మధ్య గతంలోనే వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు గుర్తింపు!
- గురువారం 9 గంటలపాటు సెవెన్‌హిల్స్ మాణిక్‌చంద్ డైరెక్టర్ అభిషేక్‌ను విచారించిన ఈడీ
- నందును ప్రశ్నించేందుకు పర్మిషన్ కోసం కోర్టులో పిటిషన్
- అధికార పార్టీ నేతలతో అతడి వ్యాపార సంబంధాలపై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారనే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయ్యింది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆర్థిక లావాదేవీలపై నజర్ పెట్టింది. అధికార పార్టీ నేతలతో నందుకుమార్‌కు ఉన్న వ్యాపార సంబంధాలపై వివరాలు రాబడుతున్నది. నందుకుమార్ డైరెక్టర్‌గా ఉన్న డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక లావాదేవీలను సేకరిస్తున్నది. ఇదే సంస్థకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు కూడా డైరెక్టర్‌గా ఉండగా.. ఆవల అభిషేక్ అనే వ్యక్తి అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లో ఆఫర్ చేసినట్లుగా పేర్కొన్న రూ.250 కోట్లకు సంబంధించిన వివరాలను ఈడీ రాబడుతున్నది. ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసినట్లుగా చెబుతున్న డబ్బు ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఫామ్‌హౌస్ కేసు తర్వాత రోహిత్‌రెడ్డి సహా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్‌లో జరిపిన భేటీ వివరాలనూ ఈడీ సేకరిస్తున్నది. రోహిత్‌రెడ్డిని ఈ నెల 19, 20వ తేదీల్లో ఈడీ విచారించింది. ఫామ్‌హౌస్ కేసులో ఆఫర్ చేసిన డబ్బుకు సంబంధించిన వివరాలతో పాటు 2015 నుంచి రోహిత్‌రెడ్డి నిర్వహిస్తున్న బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించింది. 27న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది.
నందుకుమార్ బిజినెస్ పార్ట్నర్స్పై నజర్
రోహిత్‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సెవెన్ హిల్స్ మాణిక్‌చంద్ గుట్కా డైరెక్టర్ ఆవల అభిషేక్‌కు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. అదేవిధంగా ఫామ్‌హౌస్ కేసు నిందితుడు నందుకుమార్‌ను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. విచారణకు అనుమతి కోరుతూ గురువారం నాంపల్లిలోని 3వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈడీ హైదరాబాద్ జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ పిటిషన్ దాఖలు చేశారు. నందుకుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ నం. 967/2022, మొయినాబాద్ పీఎస్‌లో నమోదైన ఫామ్‌హౌస్ కేస్ ఎఫ్‌ఐఆర్ నం.455/2022 వివరాలను వెల్లడించారు. ఈ నెల 15న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, సెక్షన్50 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ఈఎస్‌ఐఆర్)/48/2022 రిజిస్టర్ చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫామ్‌హౌస్ కేసు వివరాలను కోర్టుకు తెలిపారు. నందుకుమార్ నిందితుడుగా ఉన్న రెండు కేసుల్లో మనీ లాండరింగ్ మూలాలు ఉన్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. నందుకుమార్‌ను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌తో పాటు నలుగురు సభ్యుల టీమ్ విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ల్యాప్‌టాప్, ప్రింటర్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్‌ను పర్మిట్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
గతంలోనే వ్యాపారాలు
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న డబ్బు, నిందితుడు నందుకుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలిస్తున్నది. ఇద్దరికీ గతంలోనే వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిసింది. నందుకుమార్‌కు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే నందుకుమార్ ఆర్థిక పరిస్థితి, రోహిత్‌రెడ్డితో కలిసి చేసిన వ్యాపారాల వివరాలను రాబడుతున్నది.
అభిషేక్‌ను 9 గంటలు ప్రశ్నించిన ఈడీ
ఈడీ ఆదేశాలతో గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు అభిషేక్ హాజరయ్యాడు. రాత్రి 8.30 గంటల దాకా విచారించిన ఈడీ స్పెషల్ టీమ్.. డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు సెవెన్ హిల్స్ మాణిక్‌చంద్ వ్యాపార వివరాలు సేకరించింది. 2016 నుంచి నిర్వహించిన బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీల ఆధారంగా ప్రశ్నించింది. గత నెల 18న నందుకుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసు వివరాలను రికార్డ్ చేసింది. ఫామ్‌హౌస్ కేసులో నందకుమార్ అరెస్ట్ తర్వాత అభిషేక్ ఫిర్యాదు చేసినట్లు ఈడీ గుర్తించింది. డబ్ల్యూ 3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌లో భాగస్వామ్యం ఇస్తానని, తక్కువ ధరకు బీఎండబ్ల్యూ విక్రయిస్తానని నందుకుమార్ మోసం చేసినట్లు అభిషేక్ ఈడీ అధికారులకు వివరించినట్లు తెలిసింది. 2019 ఫిబ్రవరి నుంచి 2020 మార్చి వరకు విడతల వారీగా రూ.కోటి 75 లక్షలు వసూలు చేసినట్లు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అభిషేక్‌తో రోహిత్‌రెడ్డి, ఆయన సోదరుడు రితీష్‌రెడ్డికి ఉన్న వ్యాపారలావాదేవీలపై ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. అభిషేక్‌ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.