
దుబ్బాక, వెలుగు: ఆధునాతన సౌకర్యాలతో నిర్మించిన దుబ్బాక బస్టాండ్‌ను బుధవారం ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బస్టాండ్ పునర్నిర్మాణంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సులు నడిపేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని పేర్కొన్నారు. దశాబ్ధాల కిందట నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరుకోవడంతో బస్టాండ్‌ను ఆధునీకరించామన్నారు. ఈ నెల 30న ప్రారంభించే ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరుపతి, హన్మకొండ కు బస్సులను నడపడానికి అధికారులు సన్నద్ధం చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ ప్రజల ఆస్తి అని దానిని కాపాడుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేశ్ గౌడ్, మట్ట మల్లారెడ్డి, దూలం వెంకట్ గౌడ్,మచ్చ శ్రీనివాస్, తొగుట రవీందర్, సుంకోజు ప్రవీణ్, బావాజీ బాచి, నేహాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సరిగ్గా అమలుచేయాలి
నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ ఎంపీపీ ఆఫీస్ లో మంగళవారం సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ శ్రీనివాస్ ఉపాధి హామీ పనుల తీరును, పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు అవినీతి రహితంగా, సరైన లబ్ధిదారులకు అందేలా అధికారులు చొరవ చూపాలన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, సెక్రటరీలు, టీఏ లు ఆక్టివ్ గా పని చేసి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చాందీ బాయ్, డీఆర్డీఓ జగడేవులు, గ్రామస్తుల ప్రజలు పాల్గొన్నారు.
విధుల నుంచి తొలగించిండనికాంట్రాక్టర్ పై కత్తితో దాడి
కంది, వెలుగు : విధుల నుంచి తొలగించిండని ఓ కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డ్ శానిటరీ కాంట్రాక్టర్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ శ్రీధర్ రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి టౌన్ హాస్టల్ గడ్డ ప్రాంతానికి చెందిన ప్రవీణ్.. సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ లో శానిటరీ కాంట్రాక్టర్ జలీల్ వద్ద సెక్యూరిటీ గార్డ్ గా ఉండేవాడు. పని సరిగా చేయడం లేదని ప్రవీణ్ ను కాంట్రాక్టర్ విధుల నుంచి తొలగించాడు. దీంతో బుధవారం ప్రవీణ్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను కలిశాడు. కాంట్రాక్టర్ తో మాట్లాడి విధుల్లో తీసుకొనేలా చూస్తానని సూపరింటెండెంట్ తెలిపారు. ఆ తర్వాత ప్రవీణ్.. జలీల్ వద్దకు వెళ్లి గొడవపడి తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడిచేశాడు. గమనించిన మిగతా సిబ్బంది జలీల్ ను ట్రీట్మెంట్కోసం తరలించారు. ప్రవీణ్ పరారీ లో ఉన్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
భూములు ఆక్రమిస్తే చర్యలు
కంది, వెలుగు : చెరువు శిఖం భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంది తహసీల్దార్ విజయలక్ష్మి హెచ్చరించారు. కంది మండల పరిధిలోని కోలంపేట గ్రామంలో ఊదం చెరువు శకం భూమిలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు మొరం రోడ్డు వేశారు. ఈ విషయమై గ్రామస్తులు మండల తహసీల్దార్ ఆఫీస్ లో గత వారంలో ఫిర్యాదు చేయగా.. రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేసి శిఖం భూమిలో రోడ్డును పూర్తిగా తొలగించారు.
అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి
మెదక్ టౌన్, వెలుగు : గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ, స్పీడప్ చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా ప్రాంగణాలు ఈ నెలాఖరులోగా పూర్తిగా ఏర్పాటు చేయాలని, హరితహారం ద్వారా నర్సరీల్లో మొక్కలు పెంచాలని, పల్లె ప్రకృతి వనాలకు స్థలాలు అందుబాటులో లేకపోతే కనీసం 3 ఎకరాల నుంచి 5 ఎకరాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థవంతగా నిర్వహించాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను ప్రగతిని ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని, ఈజీఎస్ మార్గదర్శకాల మేరకు కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని పేర్కొన్నారు. గ్రామాలలో అక్రమ నిర్మాణాలను, అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో ఉంటూ చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో ఏమైనా సమస్యలుంటే వివరాలు సేకరించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. చేగుంట, నర్సాపూర్ వంటి ప్రాంతాలలో కొందరు ఫార్మ్ ల్యాండ్స్‌ను గుంటల లెక్కన విక్రయించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఎంపీడీవోలు సమావేశం దృష్టికి తీసుకురాగా హెచ్ఎండీఏ మార్గదర్శకాల మేరకు ఉంటేనే లే అవుట్ లకు అనుమతి ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరిషద్ సీఈఓ వెంకట శైలేష్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో రాజేంద్ర ప్రసాద్,జడ్పీ డిప్యూటీ సీఈఓ సుభాషిణి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
తగ్గిన నేరాల శాతం.. పెరిగిన సైబర్ క్రైమ్
సిద్దిపేట రూరల్, వెలుగు:గత రెండేండ్లతో పోలిస్తే ఈ ఏడాది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గిందని సీపీ ఎన్ శ్వేత తెలిపారు. బుధవారం సిద్దిపేట సీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఆన్యువల్ క్రైం ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ 2020–21 సంవత్సరాలలో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గిందని, కమిషనరేట్ పరిధిలో 5909 కేసులు నమోదు కాగా 11% నేరాలు తగ్గినట్టు తెలిపారు. దొంగతనాలు కేసుల్లో 52 శాతం రికవరీ ఉందని, 29% పోక్సో కేసులు, 14% రేప్ కేసులు తగ్గాయని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 7515 మంది పై కేసులు నమోదు చేసి, 66 మందికి జైలు శిక్ష విధించామన్నారు. 2023లో మహిళలకు, బాలికలకు సంబంధించిన కుటుంబ సమస్యలను, కేసులను ఒకే దగ్గర పరిష్కరించేందుకు ఏర్పాటు చేశామన్నారు.శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
మెదక్ : విస్తృతంగా వెహికల్ చెకింగ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి ఫైన్లు విధించడం వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య తగ్గిందని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. బుధవారం ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వార్షిక రిపోర్ట్‌ను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్నిపోలీస్ స్టేషన్ల పరిధిలో రెగ్యులర్‌గా వెహికిల్ చెకింగ్ లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2021లో ఎంవీఐ యాక్ట్ కింద 1,41,152 కేసులు నమోదు కాగా, 2022లో 4,35,137 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 1,138 నమోదు కాగా, ఈ సారి 8,011 కేసులు నమోదు చేసినట్టు వివరించారు. 2021లో 27 సైబర్ క్రైమ్ నమోదు కాగా, 2022లో 115 కేసులు నమోదైనట్టు తెలిపారు. అలాగే 127 ఇంటి దొంగతనాలు, 119 బైక్ దొంగతనాలు జరిగినట్టు వివరించారు.
సైబర్ నేరాల పట్ల జాగ్రత్త
సంగారెడ్డి టౌన్ : పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోజనంతో పాటు నష్టాలు ఉన్నాయని, అత్యాశతో విద్యాధికులే అధికంగా సైబర్ క్రైమ్ కారణంగా మోసపోతున్నారని ఎస్పీ రమణ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డి లోని పోలీస్ కల్యాణ మండపంలో ఆన్యువల్ క్రైమ్ రిపోర్ట్ వివరాలను వెల్లడించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, లోకదాలత్ ద్వారా 999 పరిష్కరించామని వెల్లడించారు.నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లోన్ యాప్ లపై స్పందించవద్దని సూచించారు. డీజేలు లేకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.
ఓర్వలేకే ఫ్లెక్సీలు చింపుతున్నారు..
పటాన్ చెరు, వెలుగు: ప్రజల్లో ఆదరణ పొందుతున్న నేతలను చూసి అగ్రవర్ణాల నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశిష్ గౌడ్ ఆరోపించారు. పటాన్చెరు నియోజక వర్గంలో ఆయా మండలాల్లో తమ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడంతో ఆయన మండి పడ్డారు. ఈ విషయమై ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు నందీశ్వర్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఆయన గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కొంతమంది వాటిని చింపేశారని తెలిపారు. నియోజక వర్గంలో అధికార పార్టీకి చెందిన అగ్రవర్ణాల నేతలే ఈ పని చేశారని మండిపడ్డారు.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్
- ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్
కోహెడ (హుస్నాబాద్)వెలుగు: దేశంలో పెద్ద మార్పు తీసుకురావడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నియోజక వర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావలసిన నిధులు, బ్యాంకు రుణాలను అడ్డుకుంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను నిలదీస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణ్‌రావు, సుధాకర్ రెడ్డి, జడ్పీ చైర్మెన్ సుధీర్ బాబు, ఇంద్రనీల్, ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.