పద్మను పక్కన బెట్టి.. సత్యవతి, సబితలకు మంత్రి పదవులు

పద్మను పక్కన బెట్టి..  సత్యవతి, సబితలకు మంత్రి పదవులు
  • కవితకు ఒక తీరు.. మిగిలిన మహిళలతో ఒకతీరు
  • వీఏఓల సమ్మెకు ఎమ్మెల్యే రఘునందన్​రావు మద్దతు 

మెదక్​ టౌన్​, వెలుగు :   తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డిని పక్కన పెట్టి,  ఉద్యమంలో ఎక్కడా కనిపించని సత్యవతి రాథోడ్, ఆంధ్రులకు సపోర్టు చేసి మరో పార్టీ నుంచి గెలిచిన సబితాఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం మెదక్​ కలెక్టరేట్ ​వద్ద  సమ్మె చేస్తున్న వీఏఓలకు ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. న్యాయమైన డిమాండ్ల కోసం 22 రోజులనుంచి సమ్మె చేస్తున్న వీఏఓల గురించి కేసీఆర్​గానీ, మంత్రులు హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకర్​రావు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 

ఆడబిడ్డలందరూ తన కూతురు కవితతో సమానమన్న కేసీఆర్​కు మహిళా ఉద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్​ కేసులో కవితకు నోటీసులు రాగానే ఆగమాగమై ఢిల్లీకి మంత్రులను, పెద్దపెద్ద లాయర్లను పంపిన సీఎం మండుటెండలో ఇబ్బందులు పడుతూ సమ్మె చేస్తున్న వీఏఓలపై వివక్ష చూపుతున్నారన్నారు. 32 జిల్లాల్లో వీఏఓలు సమ్మె  చేస్తుండగా మంత్రి హరీశ్​కు భయపడి సిద్దిపేటలో సమ్మె చేయడం లేదన్నారు. ఈ రోజు కాకపోయినా రేపయినా టెంట్ వేస్తారన్నారు.

 వీఏఓలకు నెలకు రూ.10 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.3,900 మాత్రమే ఇస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కూడా  లేదన్నారు. అనంతరం వీఏఓలు భిక్షాటన చేపట్టగా.. రఘునందన్​తోపాటు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్​, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​డబ్బులిచ్చారు. లీడర్లు విజయ్, శివకుమార్​, మధుసూదన్​, నాగరాజు పాల్గొన్నారు.