ప్రాణహిత చేవెళ్ల 28 ప్యాకేజీకి రూ.300 కోట్లివ్వండి : ఎమ్మెల్యే రామారావు పటేల్

ప్రాణహిత చేవెళ్ల 28 ప్యాకేజీకి రూ.300 కోట్లివ్వండి : ఎమ్మెల్యే రామారావు పటేల్
  • పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయండి
  • అసెంబ్లీలో ఎమ్మెల్యే రామారావు పటేల్​

భైంసా, వెలుగు: ముథోల్​ నియోజకవర్గంలో గతంలో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల 28 ప్యాకేజీ కు రూ.300 కోట్ల నిధులివ్వాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. తానూర్, కుభీర్ మండలాలకు సాగునీరు లేక ఆ ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయన్నారు. 

రూ.500 కోట్లతో అప్పట్లో 60 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారని, ప్యాకేజీ పూర్తి కావాలంటే రూ.300 కోట్లు అవసరమన్నారు. పనులు పూర్తయితే నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. తానూర్, కుభీర్ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, 500 ఫీట్ల వరకు వేసిన బోరు బావుల్లో నీళ్లు రావడంలేదన్నారు. 

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కలలుగన్న 28 ప్యాకేజీ పూర్తిచేయడంతో పాటు, లోకేశ్వరం మండలంలోని గోదావరి నది పరివాహాక పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్​కు మరో రూ.10 కోట్ల నిధులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పనులు పూర్తయితే 5 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఇందుకు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.