
జూలూరుపాడు, వెలుగు : పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పడమటి నర్సాపురం రైతు వేదికలో 175 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీతారామ ద్వారా మండలంలోని రైతులందరికీ సాగు నీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం కాలువ నిర్మాణ పనులలో కమీషన్లకే కక్కుర్తి పడింది తప్ప పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలన్న ఆలోచన చేయలేదని ఆరోపించారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథంలో ముందున్న ఇందిరమ్మ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం తప్ప బీఆర్ఎస్ నాయకులు ప్రజల మేలు అక్కరలేదన్నారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం 10 మంది బాధితులకు సీఎంఆర్ఎప్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎస్సై రవి, నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు మంగీలాల్, గోపు రామకృష్ణ, లచ్చు నాయక్, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.