బైక్ కొనిస్తేనే తాళి కడతానన్న వరుడు.. ఎమ్మెల్యే ఎంట్రీతో ట్విస్ట్..

బైక్ కొనిస్తేనే తాళి కడతానన్న వరుడు.. ఎమ్మెల్యే ఎంట్రీతో ట్విస్ట్..

కట్నం తీసుకోవడం నేరం.. కట్నం కోసం వేదిస్తే కటకటాలు తప్పవు.. అని తెలిసినా తెలిసినా.. కొందరు మనుషుల్లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. కట్నం ఇస్తేగాని మూడు ముళ్లు వేయనంటూ మారాం చేస్తుంటారు. కొన్నిసార్లు పెళ్లిళ్లు కూడా ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వరుడి కుటుంబానికి కట్నంపై ఉన్న మోజుతో.. వధువు కుటుంబ సభ్యులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో జరిగింది. అది కూడా ఎమ్మెల్యే ముందే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్ పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ, మల్లయ్య కూతురు అనూషకు సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్ అనే యువకుడితో మే 12న వివాహం జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికి అప్పోసప్పో చేసి పెళ్ళికి ముందే రూ.5 లక్షలు ముట్టజెప్పారు. మే 12 కేశవపట్నంలోని లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ లో వివాహం జరుగుతున్న సమయంలో కట్నంలో భాగంగా తనకు ఇవ్వాల్సి బైక్ ఇవ్వలేదని.. బైక్ కొనిస్తేనే తాళి కడతానని పెళ్లికొడుకు డిమాండ్ చేశాడు. దీంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతరు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. పెళ్లి తర్వాత బైక్ కొనిస్తామని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పినా వరుడు పెళ్లి చేసుకునేదే లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. దీంతో పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టకున్నారు. 

వరుడికి రూ. 50వేలు ఇచ్చిన రసమయి

అదే సమయానికి పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పెళ్లి కొడుకుతో మాట్లాడి బైక్ కావాల్సిన డబ్బును పెళ్లి కూతురి తరపున తానే ఇస్తానని పెళ్లికొడుకుకు నచ్చజెప్పారు. ముందుగా రూ. 50 వేల నగదును వరుడి తండ్రికి అందజేశారు. మిగిలిన డబ్బులను బైక్ షోరూంకు అందజేస్తాని హామీ ఇచ్చారు.  దీంతో పెళ్ళికి అంగీకరించిన వినయ్.. అనూష మేడలో తాళి కట్టారు. రసమయి బాలకిషన్ స్వయంగా దగ్గరుండి పెళ్లి పనులు అన్ని చూసుకుంటూ తోబుట్టువు లాంటి చెల్లెలి పెళ్ళికి కట్నంగా బైక్ కొనిచ్చి తన ఔధార్యాన్ని చాటుకున్నారు. రసమయి ఔదర్యం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.