రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ
  • ఎమ్మెల్యే ఎదుట నేలపై కూర్చొని టీఆర్ఎస్ జెడ్పీటీసీ నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే రవిశంకర్ కు సొంత పార్టీ ప్రజాప్రతినిధి నుంచే నిరసన సెగ తగిలింది. బోయినిపల్లి మండలంలోని రైతువేదికలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ కొండయ్య ఎమ్మెల్యే ఎదుటే నిరసన తెలిపారు. నేల మీద కూర్చొని తన ఆవేదనను తెలియజేశారు. దళిత ప్రజాప్రతినిధి అయిన తనను గత మూడేళ్లుగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నారని, అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండలంలో ఏ  ప్రోగ్రాం చేసినా తనకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ ఉమ నిరసనతో ఖంగుతిన్న ఎమ్మెల్యే రవిశంకర్ ఆమెకు సర్ది చెప్పారు. ఇప్పుడు ఫిర్యాదు చేసే సమయం కాదని, ఈ విషయంపై తాను తర్వాత మాట్లాడుతానని సూచించడంతో జెడ్పీటీసీ ఉమ శాంతించారు.  


..