రివర్స్​ కొట్టిన స్కీమ్లు .. ఎమ్మెల్యేలకు కట్టబెట్టడంతో బూమ్​రాంగ్​

రివర్స్​ కొట్టిన స్కీమ్లు .. ఎమ్మెల్యేలకు కట్టబెట్టడంతో బూమ్​రాంగ్​
  • ఎన్నికల కోడ్​తో కొత్తోళ్ల ఎంపికకు బ్రేక్​
  • ఇన్నాళ్లూ తమను మభ్యపెట్టి అయినోళ్లకే ఇచ్చుకున్నారని జనం ఫైర్​
  • ప్రచారంలో ఎమ్మెల్యేలకు అడ్డగింతలు

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడం ఇప్పుడు అసలుకే ఎసరు తెచ్చిపెట్టింది. పైగా గతంలో ఆ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లు కొంపముంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్​ రిలీజ్ కావడంతో ప్రచారానికి వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసనలు ఎదురవుతున్నాయి. ఆయా స్కీములకు అర్హులైన జనమంతా వాళ్లను అడ్డుకొని నిలదీస్తున్నారు. ‘‘మాకు స్కీములే ఇవ్వనోళ్లు మాదగ్గరికి ఎందుకు వస్తున్నరు?

స్కీమ్​లు ఎవరికి ఇచ్చుకున్నరో వాళ్ల దగ్గరికే పొయి ఓట్లు అడుక్కోన్రి” అంటూ తిరగబడ్తున్నారు. ఎలక్షన్స్​లోపు స్కీమ్​లు ఇస్తామని మొన్నటివరకు చెప్పిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇస్తామని అంటున్నారు. ఈ మాటలను జనం నమ్మడం లేదు. ‘‘ఇప్పుడే ఇవ్వనోళ్లు ఎన్నికలైనంక ఇస్తమంటే ఎట్ల నమ్ముతం.. ఇన్నాళ్లూ అయినోళ్లకే ఇచ్చుకొని మోసం చేసిన్రు” అని మండిపడుతున్నారు. 

దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి తెచ్చిన దళితబంధు, గృహలక్ష్మీ, బీసీ, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం వంటి పథకాలు ఎన్నికల టైమ్​లో మైలేజీ కంటే డ్యామేజీనే ఎక్కువ చేస్తున్నాయని చాలా మంది ఎమ్మెల్యేలు తమ అనుచరుల ముందు వాపోతున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ స్కీములపై రాష్ట్ర సర్కారు హడావుడి చేయడంతో తమను అర్హులుగా చేర్చాలంటూ సెగ్మెంట్లలో వేల సంఖ్యలో జనం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. 

అయితే.. ఆ స్కీమ్​ల కింద కొందరికే లబ్ధి చేకూరిందని, అది కూడా పార్టీ కార్యకర్తలు, లీడర్లకేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్​తో నిధుల రిలీజ్​కు బ్రేక్​ పడింది. పైగా అర్హులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకే ఉండటంతో అది కోడ్​ ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంతో జనానికి ఏం సమాధానం చెప్పాల్నో అర్థంకాక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగాలంటే భయపడుతున్నారు. అధికారులతో చేయించాల్సిన అర్హుల ఎంపిక ప్రక్రియను ఎమ్మెల్యేలకు అప్పగించడం అసలు టైమ్​లో రివర్స్​​ అయిందని అధికార పార్టీ లీడర్లు అంటున్నారు. 

అర్హత ఉన్నా లేకున్నా.. ఎమ్మెల్యే అనుకునోళ్లకే

స్కీముల్లో అర్హుల ఎంపిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తే.. పార్టీకి, క్యాండిడేట్​కు ఎన్నికల్లో కలిసి వస్తుందని, కేడర్​ అంతా ఎక్కడికి వెళ్లకుండా ఎమ్మెల్యే వెంటనే ఉంటుందని బీఆర్​ఎస్​ ప్రభుత్వం భావించింది. దీంతో ముఖ్యమైన స్కీమలున్నింటికీ ఎమ్మెల్యేలే అర్హుల జాబితాను డిసైడ్​ చేసేలా మార్గదర్శకాలు ఇచ్చింది. దళితబంధులో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున, బీసీలకు రూ.లక్ష సాయం స్కీమ్​ అప్లై చేసుకున్నోళ్లకు, గృహలక్ష్మీ స్కీమ్​ నియోజకవర్గానికి 3 వేల మందికి చొప్పున ఇవ్వాల్సి ఉన్నది. అయితే.. వీటన్నింటికి సంబంధించి జనం నుంచి ఎమ్మెల్యేలు పేర్లు తీసుకున్నారు. తమ దగ్గరకు వచ్చినోళ్లందరికీ ఎలక్షన్లలో తమ గెలుపు కోసం పనిచేయాలని షరతులు పెట్టారు. 

ఎక్కడ మీటింగ్​ పెట్టినా రావాలని,  పోలింగ్​ అప్పుడు ఓట్లు కూడా ఏపియ్యాలని మాట తీసుకున్నారు. ఎన్నికల లోపు స్కీమ్​లు వస్తాయని చెప్పుకొచ్చారు. తీరా.. ఎన్నికల షెడ్యూల్​ కంటే ముందు రోజు, షెడ్యూల్​ ప్రకటించిన రోజు హడావుడిగా కొందరికి గృహలక్ష్మీ మంజూరు పత్రాలు ఇచ్చారు. మిగతా వారికి ఇయ్యలేదు. గృహలక్ష్మి, దళితబంధు, బీసీలకు లక్ష సాయం లిస్ట్​ చూస్తే అంతా దగ్గరి లీడర్లు, కార్యకర్తలకు సంబంధించినోళ్ల పేర్లే ఉన్నాయి. దీంతో జనం తిరగబడ్తున్నారు. పార్టీ వాళ్లకే ఇచ్చుకుంటామని గతంలో కొందరు ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లను కూడా వారు గుర్తుచేస్తూ.. ఆ పార్టీ వాళ్లతోనే ఓట్లు వేయించుకోండి అంటూ తేల్చిచెప్తున్నారు.

కమీషన్ల దందా కేసీఆర్​కు తెలిసినా ఆపలే

దళితబంధు స్కీమ్​లో లబ్ధిదారులుగా చేర్చినందుకు, ప్రభుత్వం నుంచి పైసలు ఇప్పించినందుకు కొందరు ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని గతంలో బీఆర్​ఎస్​ ఇంటర్నల్​ మీటింగ్స్​లో సీఎం కేసీఆరే అన్నారు. స్కీముల్లో చేర్చి లబ్ధి చేకూర్చినందుకు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు డబ్బులు తీసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ రిపోర్టుల్లోనూ వెల్లడైంది. పథకాల్లో రాజకీయ జోక్యం తగదని గతంలో హైకోర్టు కూడా తప్పుబట్టింది. 

ఎమ్మెల్యే సిఫార్సులకు, అర్హుల ఎంపికకు ఎలాంటి  సంబంధం లేదని  తేల్చిచెప్పింది. ఎమ్మెల్యే సిఫార్సు ఉండాలని చెప్పి దళితబంధు అప్లికేషన్లను వరంగల్​ జిల్లా కలెక్టర్‌‌‌‌ తిరస్కరించడాన్ని అప్పట్లో తప్పుబట్టింది. అర్హత మేరకు ఎంపిక ఉండాలని సూచించింది. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం.. అర్హుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకే అప్పగించింది. వారు సిఫార్సు చేసినోళ్లకే స్కీమ్​లకు ఎంపికయ్యే పరిస్థితి తెచ్చింది. 
 
స్కీములిస్తే ఓటర్లను ప్రలోభపెట్టడమే

స్కీములన్నీ నేరుగా ఎమ్మెల్యేలకు లింక్​ అయి ఉన్నాయి. ఎమ్మెల్యేనే అర్హులను ఎంపిక చేయడంతో ప్రభుత్వం నుంచి నిధులు అందితే అది ప్రలోభం కిందికే వస్తుందని ఈసీ భావిస్తున్నది. ఎన్నికలు ఉన్నందున జిల్లాల కలెక్టర్లు కూడా స్కీముల విషయంలో ముందుకు వెళ్లేది లేదంటున్నారు. అర్హుల ఎంపిక బాధ్యత ఆఫీసర్లకు ఇస్తే బాగుండేదని  ఎమ్మెల్యేలు లీడర్లు ఇప్పుడు అనుకుంటున్నారు.

అడుగడుగునా అడ్డగింతలు

  • సోమవారం హనుమకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి బైక్​ ర్యాలీతో వెళ్తుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ‘‘స్కీములు మీ వాళ్లకే ఇచ్చుకుంటారు. మా కాలనీలో ఒక్కరికి కూడా పథకాలు ఇవ్వలేదు” అని మండిపడ్డారు. 
  • ప్రజాధనంతో చేపడుతున్న ప్రభుత్వ పథకాలను కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే అందిస్తున్నారని, నిరుపేదలను పట్టించుకుంటలేరని నిర్మల్‌‌ జిల్లా నర్సాపూర్‌‌ (జి)లో ముథోల్‌‌ ఎమ్మెల్యే విఠల్‌‌రెడ్డిని ఓ మహిళ నిలదీశారు. నర్సాపూర్‌‌(జి)లో ఎమ్మెల్యే శనివారం గృహలక్ష్మి ప్రొసీడింగ్‌‌లను పంపిణీ చేశారు. అధికార పార్టీకి చెందిన వారినే అర్హులుగా ఎంపిక చేయడంపై మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన సుశీల మండిపడ్డారు. 
  •  100 దళిత కుటుంబాలు ఉంటే ఒక్కరికి కూడా దళిత బంధు ఎందుకు మంజూరు చేయలేదని మెదక్  జిల్లా వెంకటపూర్  గ్రామస్తులు జడ్పీ వైస్  చైర్​పర్సన్​ లావణ్యరెడ్డిని నిలదీశారు.  ఈ నెల 11న వెంకటాపూర్​కు వచ్చిన ఆమె బీఆర్​ఎస్ మీటింగ్​లో  మాట్లాడుతుండగా.. దళితులు అక్కడికి చేరుకుని  నిరసన తెలిపారు.  
  •  సూర్యాపేట జిల్లా ఆత్మకూర్( ఎస్) మండలంలోని నెమ్మికల్ గ్రామంలోని దళితులకు  దళిత బంధు రాలేదని సర్పంచ్ ని నిలదీశారు. దీనితో సర్పంచ్ కొడుకు ఒక దళితుడిని కొట్టడంతో గ్రామంలోని దళితులు సూర్యాపేట – దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులకే దళిత బంధు ఇచ్చారని మండిపడ్డారు. మంత్రి ఇచ్చిన గడియారాలను పగులగొట్టారు.   ధర్నా చేసిన దళితులపై ఆత్మకూర్ పోలీసులు  కేసు పెట్టారు. 

ఇటీవల హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తిలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ‘‘ఎన్నికలు వస్తేనే ఊర్లు యాదికొస్తయా’’ అని నిలదీశారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించకుండా ఓట్ల కోసం వచ్చుడేందని ప్రశ్నించారు. ‘‘అర్హులైన వృద్ధులకు పింఛన్లు వస్తలేవు. సంక్షేమ పథకాలన్నీ ఎమ్మెల్యే అనుచరులకే ఇస్తున్నరు’’ అంటూ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​పై తిరగబడ్డారు. 

ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్  తమ ఊరికి రావొద్దంటూ నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి దళితులు రోడ్డుకు అడ్డంగా ముండ్ల కంప వేసి నిరసన తెలిపారు. రోడ్డుపై ప్లకార్డులు ప్రదర్శించి..  ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దళిత బంధు ఎంపికలో బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు.