ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బెదిరిస్తుండు : డీసీసీబీ చైర్మన్ కాంగ్రెస్ నేత మనోహర్ రెడ్డి ఆరోపణ

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బెదిరిస్తుండు : డీసీసీబీ చైర్మన్ కాంగ్రెస్ నేత  మనోహర్ రెడ్డి ఆరోపణ
  • కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఏఎంసీ చైర్మన్, తాండూరు మండల అధ్యక్షులు

వికారాబాద్, వెలుగు: ఎమ్మెల్యే రోహిత్  రెడ్డి, బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్న వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.  సోమవారం తాండూరు పట్టణంలోని ఎస్పీఆర్‌‌ గార్డెన్‌లో కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్‌‌తో కలిసి సమావేశానికి హాజరయ్యారు. తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్,  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్, బషీరాబాద్ మండల బీఆర్ఎస్  సీనియర్‌‌ నాయకులు రాము నాయక్‌తో పాటు తాండూరు మార్కెట్ కమిటీ మాజీ  డైరెక్టర్ మల్లప్ప బషీరాబాద్ మండలాలకు  చెందిన పలువురు సర్పంచులు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికి మనోహర్ రెడ్డి,  డా. సంపత్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ మారుతున్న వారిని బెదిరిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని సూచించారు.  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిపై మాట్లాడే హక్కు రోహిత్ రెడ్డికి లేదన్నారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరిన రోహిత్ ఇలా బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. 

రోహిత్ రెడ్డి తల్లి కూడా కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీగా గెలిచి పార్టీ మారిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.  గెలిపించిన ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పార్టీ మారిన ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్  నుంచి కాంగ్రెస్  లో చేరుతున్న సర్పంచులు, నేతలపై అనవసరంగా బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు అందరూ సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌‌ గౌడ్, యాలాల మండల అధ్యక్షుడు భీమప్ప, శంకర్, యూత్ కాంగ్రెస్  అధ్యక్షుడు బోయ అశోక్, ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.