ట్రాఫిక్‌‌ CIని కాలితో తన్నిన MLA కొడుకు

ట్రాఫిక్‌‌ CIని కాలితో తన్నిన MLA కొడుకు

మాదాపూర్, వెలుగు: నా వాహనాన్నే ఆపుతావా ? నేనెవరో తెలుసా అంటూ ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ను తిడుతూ దాడి చేశాడు  ఓ ఎమ్మెల్యే కొడుకు మాదాపూర్‌‌ పోలీసుల కథనం ప్రకారం…సోమవారం సాయంత్రం మాదాపూర్​ ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ రాజ్​గోపాల్​రెడ్డి ఖానామేట్ చౌరస్తాలో డ్యూటీ చేస్తున్నాడు. ట్రాఫిక్​ రద్దీ ఎక్కువగా ఉండడం, వన్​వే ఉండడం తో 6.30 గంటల సమయంలో ట్రాఫిక్​ క్లియర్​ చేస్తున్నారు. ఇదే సమయంలో  ఆంధ్రప్రదేశ్​ జగ్గయ్యపేట్ ఎమ్మెల్యే సామినేని ఉదయ్​భాను కుమారుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్​ తన కారులో హైటెక్స్​ నుండి కొండాపూర్​ వైపు  వెళ్తున్నాడు.  కారు ఖానామేట్​ వద్దకు చేరుకోగానే  ఇన్​స్పెక్టర్​ రాజ్​గోపాల్​రెడ్డి కారును నిలిపి వేసి వన్​వే కాబట్టి వెళ్లవద్దని చెప్పారు. దీంతో ప్రసాద్ కారు దిగి  తాను ఎవరో తెలుసా? ఎవరి కారును ఆపావో తెలుసా  అంటూ ఇన్​స్పెక్టర్​ను దూషిస్తూ పైపైకి వచ్చాడు. దీంతో ఇన్​స్పెక్టర్​ రాజ్​గోపాల్​రెడ్డి ‘మీరు ఎవరైనా రూల్స్‌‌ అందరికీ ఒకేటా ఉంటాయ్‌‌’ అని చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రసాద్​ నాకే రూల్స్​ చెప్తావా అంటూ ఇన్​స్పెక్టర్​ను  బూటు కాలితో తన్నాడు. దీంతో రాజ్‌‌గోపాల్‌‌ రెడ్డి గాయపడ్డాడు. వెంటనే ఆయన మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఎస్​ఐ ఏ. శ్రీనివాస్​ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ఎమ్మెల్యే కుమారుడు వెంకటకృష్ణ ప్రసాద్‌‌  ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.