రేవంత్ ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతరు

రేవంత్ ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతరు

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య విమర్శలకు దిగారు. రేవంత్ పిల్లి కూతలకు ఎవరూ భయపడరని సుధీర్ రెడ్డి అన్నారు. తమవి సేవా రాజకీయాలని, రేవంత్ రెడ్డివి బ్లాక్ మెయిల్ రాజకీయాలన్నారు. మల్కాజిగిరికి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కరోనా సమయంలో ఒక్క రోజైనా కనిపించావా అంటూ ప్రశ్నించారు. ఆపత్కర సమయంలో ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉన్నావా అని క్వశ్చన్ చేశారు. మీడియాకు దగ్గరగా ప్రజలకు దూరంగా ఉంటూ సంచనాలు మాట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ నేతలు పార్టీ మారడానికి రెడీ అవుతున్నరు
‘టీడీపీ నుంచి కాంగ్రెస్‌‌కు వెళ్లినప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేశారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రేవంత్ ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే మంచిది. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసి హింస వైపు తీసుకెళ్తున్నారు. ఇది సరికాదు. ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా రేవంత్ హీరోయిజం ఉంటే మంచిది. గుండాయిజం రాజకీయాల్లో పనికిరాదు. సీఎల్పీని విలీనం చేస్తామని మేం చెప్పలేదు. కాంగ్రెస్‌లో నేను 30 ఏళ్లు ఉన్నా. రేవంత్ వెనుక ఉన్నది తెలంగాణకు చెందిన వారు కాదు. తెలంగాణలో రేవంత్‌‌ను అడ్డం పెట్టుకుని ఇక్కడ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. లింగోజిగూడలో టీఆర్ఎస్, బీజేపీ ఏకం కాలేదు. అక్కడ మరణించిన నేత కుటుంబ సభ్యులు కేటీఆర్‌ను కలిశారు. అందుకే ఏకపక్షం కోసం పోటీలో టీఆర్ఎస్ లేదు. రేవంత్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ నేతుల పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు’ అని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

రేవంత్‌ను ఉరికిచ్చి కొడతరు
‘నాలుగు పార్టీలు తిరిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి మమ్ములను విమర్శించే హక్కు లేదు. మమ్ముల్ని రాళ్లతో కొడితే రేవంత్‌‌ను చెప్పుతో కొట్టాలి. ప్రజా సమస్యలను పట్టించుకోని నేత రేవంత్ రెడ్డి. వందల మంది టీమ్‌‌లతో బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో చంద్రబాబు పక్కన ఉన్న తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. రేవంత్ ఇలాగే ప్రవర్తిస్తే తెలంగాణ ప్రజలు ఉరికిచ్చి కొడతరు. పీసీసీ కమిటీలో నిజమైన కాంగ్రెస్ కనిపించడం లేదు. రేవంత్ డబ్బులు పెట్టి పీసీసీ కమిటీ వేయించుకున్నారు’ అని చిరుమర్తి లింగయ్య విమర్శించారు.