ఇట్లైతే నడవదు..జిల్లా ఆఫీసర్లపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫైర్

ఇట్లైతే నడవదు..జిల్లా ఆఫీసర్లపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫైర్
  •     గరంగరంగా నాగర్​కర్నూల్​ జడ్పీ మీటింగ్

నాగర్ కర్నూల్,​ వెలుగు: ‘జిల్లాలో ఏం జరుగుతుందో జిల్లా అధికారులకు సమాచారం లేదు. పని చేసినా, చేయకపోయినా నడుస్తదనుకుంటే  కుదరదు. ఇది బీఆర్ఎస్​ ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వం. కీలక శాఖల అధికారులు పాత సమాచారంతో జడ్పీ మీటింగ్​కు రావడం ఏం పద్దతి’ అని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫైర్​ అయ్యారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాల్సిందేనన్నారు. చర్యల నివేదికలు లేకుండా వివిధ శాఖల అధికారులు జడ్పీ మీటింగ్​కు రావడం, వాటిని సీఈవో ఆమోదించి సభ్యులకు పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందని జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జడ్పీ చైర్​పర్సన్​ శాంతకుమారి అధ్యక్షతన శనివారం జరిగిన జడ్పీ మీటింగ్​కు ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఇరిగేషన్, మిషన్​ భగీరథ, పంచాయతీరాజ్, సివిల్​ సప్లై, సంక్షేమ శాఖలపై జరిగిన రివ్యూలో అధికారులు పాత  నివేదికలు ఇవ్వడంపై మండిపడ్డారు. గత సమావేశంలో లేవనెత్తిన అంశాలు, సమస్యలను ఎవరు సమీక్షించి ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. 

కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్  భూసేకరణ కింద రైతులకు ఎంత చెల్లించాలని జడ్పీ వైస్​ చైర్మన్​ బాలాజీసింగ్​ అడిగిన ప్రశ్నకు ఎస్ఈ, ఈఈలు నీళ్లు నమిలారు. పాత లెక్కలు చూపిస్తారా? అని గట్టిగా నిలదీయడంతో సవరించిన సమాచారం  ఇస్తామని చెప్పారు. ఇరిగేషన్, సివిల్​సప్లై, మిషన్​ భగీరథ, పంచాయితీ రాజ్​ ఆఫీసర్లు ఇచ్చిన సమాధానాలను సీఈవో సమర్థించడంతో జడ్పీటీసీలు సీరియస్​ అయ్యారు.

పద్దతి మారాల్సిందే..         

జిల్లాలో అంగన్​వాడీ బిల్డింగులు కడుతున్నారని, ఏశాఖ సూపర్​వైజ్​ చేస్తుందో ఎవరికీ తెలియని దుస్థితి ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ మండిపడ్డారు. రూ. కోట్ల పనులను నామినేషన్​ పద్ధతిలో కట్టబెట్టారని, బిల్లులు ఎవరికి చెల్లిస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తే తమకు తెలియదని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. టెట్​ కూడా క్వాలిఫై కాని 16 మంది నాన్​ లోకల్స్​కు ఐటీడీఏ ఆఫీసర్లు ఏజెన్సీలో టీచర్​ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని నిలదీశారు. జీపీ స్పెషల్​ ఆఫీసర్లలో 50 శాతం ఇప్పటి వరకు గ్రామాలకు వెళ్లలేదని విమర్శించారు. 

తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, ఇతర సమస్యలు పరిష్కరించడం లేదని, జీపీ సెక్రటరీలు కూడా డ్యూటీ సరిగా చేయడం లేదని సీరియస్​ అయ్యారు. బల్మూరు గోదాం నుంచి 2 వేల బస్తాల వడ్లు దొంగతనం జరిగితే సివిల్​ సప్లై ఆఫీసర్​కు కనీస సమాచారం కూడా లేదన్నారు. తాను అడిడితే తెలవదని సమాధానం ఇచ్చాడని ఎమ్మెల్యే అన్నారు. ఔట్​ సోర్సింగ్, కాంట్రాక్ట్​ ఏజెన్సీలు వేరే ప్రాంతం వారిని నియమించి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. జూన్​ మొదటి వారంలో అన్ని ఏజెన్సీల కాంట్రాక్ట్​ రద్దు చేయాలని ఆదేశించారు.

మిల్లర్లపై చర్యలేవి?

జడ్పీ వైస్​ చైర్మన్​ బాలాజీ సింగ్, జడ్పీటీసీలు భరత్ ప్రసాద్, ప్రతాప్​రెడ్డి, మంత్ర్యా నాయక్, రాంబాబు తదితరులు మాట్లాడుతూ సీఎంఆర్​ ఇవ్వని మిల్లర్లపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎన్ని మిల్లులు తనిఖీ చేశారని నిలదీశారు. ఐదు సమావేశాలుగా ఈ విషయాన్ని అడుగుతున్నా దాటవేస్తున్నారని మండిపడ్డారు. వడ్లు, బియ్యం దందాకు అధికారులే కారణమని ఆరోపించారు. ఇదిలాఉంటే పలు కీలకశాఖలపై సమీక్ష జరగకుండానే సమావేశం ముగిసింది. సమవేశానికి కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్​ హాజరుకాలేదు.