ఖానాపూర్, వెలుగు: ఆస్ట్రానమీ ల్యాబ్తో సైన్స్పట్ల విద్యార్థులకు పరిజ్ఞానం పెరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మస్కాపూర్ జడ్పీఎస్ఎస్ లో రూ.5.80 లక్షలతో ఏర్పాటు చేసిన ఆస్ట్రానమీ ల్యాబ్ ను శనివారం ప్రారంభించారు. సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను చూసి, తమ పిల్లలను చేర్పించాలని కోరారు.
జిల్లాలో మస్కాపూర్ పాఠశాల ఆదర్శంగా ఉందన్నారు. ఇటీవల ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో 10 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తే 35 మంది విద్యార్థులు పాల్గొనగా.. 31 మంది ప్రతిభ కనబరిచారని తెలిపారు. వారికి ప్రశంసాపత్రాలు అందించారు. అలాగే పీఎం శ్రీ కింద మంజూరైన స్పోర్ట్స్కిట్లను పంపిణీ చేశారు. డీఈవో భోజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, వైస్ చైర్మన్ మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్లు సత్యం, రాజేందర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్ తదితరులున్నారు.
రైతులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హెచ్చరించారు. శనివారం ఖానాపూర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ప్రారంభించారు. కడెం మండలం అల్లంపల్లికి చెందిన రైతులు మక్కలు తీసుకువస్తే కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన పీఏసీఎస్ సీఈవో పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కడెం, వెలుగు: లక్ష్మీసాగర్ లో పీఏసీఎస్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్అభిలాష అభినవ్ శనివారం ప్రారంభించారు. చిన్న బెల్లాల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అడిషనల్కలెక్టర్ కిశోర్ కుమార్, తహసీల్దార్ ప్రభాకర్ తదితరులున్నారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
పెంబి, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశించారు. నాగపూర్ లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేశారు. పిల్లలకు రుచికరమైన భోజనం అందించాలని చెప్పారు. కొసగుట్టలో నూతన జీపీ భవనానికి భూమిపూజ చేశారు.
