మిషన్​ భగీరథ స్కీమ్.. ​అతిపెద్ద స్కామ్​ : ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి

మిషన్​ భగీరథ స్కీమ్.. ​అతిపెద్ద స్కామ్​ : ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి
  • రూ. 42 వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలకు నీళ్లివ్వడంలో 
  • గత సర్కారు ఫెయిల్​: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  • ఈ స్కీమ్​లో అవకతవకలపై విచారణ జరిపించాలి
  • దీనికి ప్రత్యామ్నాయ స్కీమ్​ను తీసుకురావాలి
  • కాకా చొరవ వల్లే  అభివృద్ధిలో సింగరేణి 
  • ఇండస్ట్రియల్​ రీఫార్మ్స్​ ​​తెచ్చిందే కాంగ్రెస్​ పార్టీ
  • ట్రిలియన్​ డాలర్​ ఎకానమీ దిశగా రాష్ట్రం దూసుకెళ్తున్నదని వెల్లడి
  • అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై  ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ మిషన్ భగీరథ స్కీమ్​.. అతిపెద్ద స్కామ్ అని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మిషన్ భగీరథ స్కీమ్​లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో భాగంగా వివేక్​ వెంకటస్వామి మాట్లాడారు.

గత బీఆర్ఎస్ సర్కారు మిషన్​ భగీరథ స్కీమ్​కు రూ.42 వేల కోట్లు ఖర్చు చేసినా..  ప్రజలకు నీళ్లివ్వడంలో ఫెయిల్ అయిందని విమర్శించారు.  ఈ పథకం వల్ల కాంట్రాక్టర్లే లబ్ధి పొందారని అన్నారు. మిషన్ భగీరథ పేరుతో కాంట్రాక్టర్లు ఎంత దోచుకున్నారో తేలాలని డిమాండ్ చేశారు. ఈ పథకానికి ఆల్టర్నేటివ్ గా మరో స్కీమ్ ను ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. చెన్నూరు నియోజకవర్గంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 

సింగరేణిని కాపాడిందే కాకా..

తన తండ్రి వెంకటస్వామి (కాకా) చొరవ వల్లే సింగరేణి నేడు అభివృద్ధిలో ఉన్నదని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు.  ‘‘కాకా  తెలంగాణకు ఏం చేశారని కేసీఆర్ అంటున్నారట.. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అప్పటి ప్రధానిని ఒప్పించి రూ.400 కోట్ల  లోన్ ఇప్పించారు. లక్షమంది కార్మికులు ఉన్న సింగరేణి సంస్థను కాపాడారు” అని పేర్కొన్నారు.  

నాడు కాకా చేసిన కృషి వల్లే నేడు సింగరేణి విస్తరిస్తున్నదని చెప్పారు. నాటి ప్రధాని మన్మోహన్​సింగ్​ను ఒప్పించి సింగరేణి పవర్​ ప్లాంట్​ను సాంక్షన్​ చేయించారని గుర్తు చేశారు. అదేప్లేస్​లో మరో 800 మెగావాట్ల థర్మల్​ పవర్​ ప్లాంట్​ ఏర్పాటు చేయాలని సీఎంను కోరామని తెలిపారు. 

తెలంగాణ ఎకానమీ గ్రోత్​ బాగుంది

తెలంగాణ ఎకానమీ గ్రోత్ రేట్ బాగుందని, ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు వెళ్తున్నామని ఎమ్మెల్యే వివేక్​ తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్‎తో ముందుకు వెళ్తున్నారని, రాష్ట్రానికి గతం కంటే ఎక్కువ నిధులు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే దావోస్​ వెళ్లగా మొదటి దఫా రూ.45 వేలకోట్ల  పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.

బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం రూ.24 వేల కోట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. రూ.45 వేల కోట్లలో ఎన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు  వచ్చాయని చాలా మంది మాట్లాడారని, అఫీషియల్​ రికార్డుల ప్రకారం  90 శాతం పెట్టుబడులు  రాష్ట్రానికి వచ్చాయని, ఎంప్లాయిమెంట్​ జరిగిందని వివరించారు. ఈ యేడు మళ్లీ సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి శ్రీధర్​బాబు దావోస్​ వెళ్లినపుడు రూ.1.73 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వీటి ద్వారా దాదాపు రూ.50 వేల ఉద్యోగాలు కల్పించాలనే విజన్​తో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు.

రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ డెవలప్​మెంట్​సెంటర్ అద్భుతమని కొనియాడారు. దీని ద్వారా చాలా మంది యువత స్కిల్ డెవలప్ చేసుకుంటారని.. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో విస్తరించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని, మెట్రో విస్తరిస్తే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని తెలిపారు. గత కొన్నేండ్లుగా ఇండస్ట్రియల్​కు ఇన్వెస్ట్​మెంట్​ సబ్సిడీ  రావడం లేదన్నారు.

ప్రత్యేకంగా ఎస్సీలకు సంబంధించిన ఇండస్ట్రీలు మూతపడ్డాయని తెలిపారు. తాజాగా ప్రభుత్వం బడ్జెట్​లో   రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని, అందులో రూ.500 కోట్లు ఎస్సీ, ఎస్టీ ఇండస్ట్రియల్​ కు ఇచ్చారని చెప్పారు.  రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్లలో బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లిడ్​ క్యాప్​కు చాలా పెద్ద ల్యాండ్​బ్యాంక్​ ఉన్నదని, దీన్ని మానిటైజ్​​చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కాంగ్రెస్​తోనే ఇండస్ట్రియల్​ రెవల్యూషన్​

దేశంలో ఇండస్ట్రియల్​ రెవల్యూషన్​  తెచ్చిందే కాంగ్రెస్​ పార్టీ అని వివేక్​ అన్నారు.  మన్మోహన్​ సింగ్​ ఆర్థిక మంత్రిగా , ప్రధానిగా అనేక రీఫార్మ్స్​ తీసుకువ చ్చారని తెలిపారు. యూపీఏ– 1, యూపీఏ– 2 లో మన్మోహన్​సింగ్​ ప్రధానిగా ఉన్న కాలంలోనే   8 నుంచి 10 శాతానికి జీడీపీ గ్రోత్​ రేట్​పెరిగిందని చెప్పారు.

గ్రోత్​ రేట్​ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ట్యాక్స్​లతోపాటు ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. నేడు ప్రపంచంలోనే దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నదని, రాబోయే రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నదని చెప్పారు.