ప్రపంచంలో అంబేద్కర్ విగ్రహాలే ఎక్కువ: ఎమ్మెల్యే వివేక్

ప్రపంచంలో అంబేద్కర్ విగ్రహాలే ఎక్కువ: ఎమ్మెల్యే వివేక్

కుల వ్యవస్థ దూరం చేయడమే అంబేద్కర్ ఆశయమని ...ఆయన స్ఫూర్తిగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ లో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 133వ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గా మొదటిసారి మందమర్రి అంబెడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అందరికి స్ఫూర్తి, దారి చూపిన మహనీయుడు అంబేద్కర్ అని చెప్పారు. దేశంలో కుల వివక్ష ఉండేది.. దీన్ని రూపుమాపి.. అంబెడ్కర్ దళితులను,పేదలను ఆదుకున్నారని చెప్పారు. ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకా వెంకటస్వామి అనేక అంబేద్కర్ కాంస్య విగ్రహాలు ఇచ్చారని చెప్పారు. ఇప్పటి వరకు తాను 110 అంబెడ్కర్ విగ్రహాలు ఇచ్చానని.. అంబెద్కర్ విగ్రహాలు పంపిణీ చేసే వరం ఆ దేవుడు కల్పించాడన్నారు.

దళితులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత అంబెడ్కర్ దేనన్నారు. మందమర్రిలో మంచి కాంస్య విగ్రహం పెట్టించి.. అంబెడ్కర్ భవనం కట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు.  అందరూ ఐక్యంగా ఉండాలని.. విభేదాలు పక్కన పెడితే అన్నిటికీ తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే వివేక్ చెప్పారు.