రెండేళ్లు కష్టపడితేనే భవిష్యత్తు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

రెండేళ్లు కష్టపడితేనే భవిష్యత్తు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: రెండేళ్లు కష్టపడి చదివితే భవిష్యత్తు బాగుంటుందని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలో రూ. 3.10 కోట్లతో చేపట్టిన ఒకేషనల్  జూనియర్  కాలేజీ బిల్డింగ్​కు, రూ.2 కోట్లతో చేపట్టిన ప్రభుత్వ బాలుర జూనియర్  కాలేజీ అడిషనల్​ క్లాస్​ రూమ్స్​ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వారు కష్టపడి చదివిస్తున్నారనే విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. 

ప్రైవేట్  కాలేజీలకు దీటుగా గవర్నమెంట్​ కాలేజీల్లో సౌలతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. గత ఏడాది ఎంసెట్​లో  114 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ లో ఫ్రీ సీట్లు సాధించారని, ఈ సంఖ్య మరింత  పెరగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్​లో  39 మందికి సీఎంఆర్ఎఫ్  చెక్కులు  అందజేశారు, ముడా, లైబ్రరీ, ఏఎంసీ చైర్మన్లు లక్ష్మణ్ యాదవ్, మల్లు నర్సింహారెడ్డి, బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ  పాల్గొన్నారు.

మహిళల పేరుతోనే సంక్షేమ పథకాలు..

హన్వాడ: మహిళల పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బుద్దారం గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇందిర మహిళా శక్తి సంబరాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కాంగ్రెస్  పార్టీని ఆశీర్వదించి ఓట్లు వేస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెప్పారు. 

బుద్దారం మహిళా సంఘం సభ్యురాలు ఉప్పగంటి బాలమణి చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్  పథకం కింద రూ.10 లక్షలు మంజూరు కాగా, చెక్కును ఆమె భర్త కృష్ణయ్యకు అందజేశారు. సుధాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వేముల కృష్ణయ్య, వి.మహేందర్, నవనీత పాల్గొన్నారు.