బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుంది :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పాత పాలమూరులోని మల్టీ పర్పస్  కమ్యూనిటీ హాల్​లో బీసీ కులసంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్​రెడ్డి చర్యలతో బీసీ రిజర్వేషన్ పై ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. భారత్​ జోడోయాత్ర సందర్భంగా విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పెరిగితేనే బీసీల స్థితిగతుల్లో మార్పు వస్తుందని రాహుల్​గాంధీ గుర్తించారన్నారు. 

దేశంలోని బీసీ నేతలందరినీ ఢిల్లీకి పిలిపించి రిజర్వేషన్  అమలు కోసం  కృషి చేస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్  అమలు చేయకపోతే బీజేపీకి బీసీలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్  ముదిరాజ్, ముడా చైర్మన్  లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షుడు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఎన్పీ వెంకటేశ్, గోపాల్ యాదవ్ పాల్గొన్నారు.