వరుసగట్టి అర్సుకుంటున్రు: కొవిడ్ సెంటర్లకు ఎమ్మెల్యేలు, ఎంపీల క్యూ

వరుసగట్టి అర్సుకుంటున్రు:  కొవిడ్ సెంటర్లకు ఎమ్మెల్యేలు, ఎంపీల క్యూ

జిల్లాల్లో కొవిడ్ సెంటర్లకు ఎమ్మెల్యేలు, ఎంపీల క్యూ
గాంధీ దవాఖానకు కేసీఆర్​ వెళ్లడంతో​ లీడర్లలో కదలిక
ఏడాదిగా కొవిడ్​ సెంటర్ల దిక్కు చూడని నేతలు

(వెలుగు, నెట్​వర్క్​):‘‘సరిపడా ఆక్సిజన్​ లేదు.. వెంటిలేటర్లు, రెమ్డిసివిర్​ ఇంజక్షన్లు దొరుకుతలేవు.. చస్తున్నాం.. కాపాడండి.. ’’ అంటూ ఇన్నాళ్లూ జనం మొత్తుకున్నా కదలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గురువారం పలు జిల్లాల్లోని కొవిడ్​ సెంటర్లకు క్యూ కట్టారు. పేషెంట్లను పేరుపేరునా పలకరిస్తూ.. ‘ట్రీట్​మెంట్​ మంచిగున్నదా?  రోజూ డాక్టర్​ వచ్చి చూస్తుండా? మందులు సక్కగిస్తున్నరా? భోజనం మంచిగ పెడుతున్నరా?’ అని అడిగి తెలుసుకున్నారు. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే లీడర్లు రావడం వెనుక కథ వేరే ఉన్నదనే టాక్​ వినిపిస్తోంది. బుధవారం గాంధీ హాస్పిటల్​లోని కొవిడ్​ వార్డును సీఎం కేసీఆర్​ విజిట్​ చేసి పేషెంట్ల బాగోగులు 
అర్సుకున్నరు కదా, అందుకే  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కరోనా పేషెంట్ల దారి పట్టారనే చర్చ జరుగుతోంది. ఈ పని ఎప్పుడో చేసి ఉంటే హాస్పిటళ్లలో కొన్ని సమస్యలైనా పరిష్కారమయ్యేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
ఇన్నాళ్లూ పట్టించుకునే దిక్కు లేదు
రాష్ట్రంలో కరోనా వైరస్​ ప్రవేశించి ఏడాది దాటింది. ఫస్ట్​, సెకండ్​ వేవ్​లలో కలిపి దాదాపు ఐదున్నర లక్షల మంది కరోనా బారినపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారమే 3 వేల మందికి పైగా చనిపోయారు. ప్రస్తుత సెకండ్​వేవ్​ మరీ భీకరంగా ఉంది. ఆస్పత్రులన్నీ  కొవిడ్ కేర్​ సెంటర్లుగా 
మారిపోయాయి. 

కొద్ది నెలలుగా సరిపడా ఆక్సిజన్​, వెంటిలేటర్లు, రెమ్డిసివిర్​ ఇంజక్షన్లు దొరక్క  పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరైతే తమను కాపాడుమంటూ వీడియోలు తీసి సోషల్​మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే సీఎం గానీ, మంత్రులు గానీ,  ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ కొవిడ్​ సెంటర్లను సందర్శించలేదు. సీఎంతో పాటు మంత్రులు కూడా ‘అంతా బాగుంది..’ అంటూ మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు రావడంతో సీఎం కేసీఆర్​ బుధవారం గాంధీ హాస్పిటల్​ను విజిట్​ చేసి కరోనా పేషెంట్ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇక అంతే.. తెల్లవారిందో లేదో పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కొవిడ్​సెంటర్లకు క్యూ కట్టారు.  
పేషెంట్లకు పలకరింపులు.. సమస్యలపై ఆరా 
ఆర్థిక మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి  మెదక్​ జిల్లా ప్రభుత్వాస్పత్రిని గురువారం సందర్శించి, అక్కడి కొవిడ్​ వార్డులో ట్రీట్​మెంట్​ పొందుతున్నవాళ్లను పరామర్శించారు. రోజూ డాక్టర్​ఎన్నిసార్లు వచ్చి చెక్​ చేస్తున్నారు?  ఏమైనా సమస్యలున్నాయా? అని ఆరా తీశారు. పేషెంట్లను పేరు పేరునా పలకరించారు. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎంపీ రాములు,  ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్  శర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో కలిసి కల్వకుర్తి, నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొవిడ్ ఐసోలేషన్ ​సెంటర్లను విజిట్​ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ట్రీట్​మెంట్ పొందుతున్న పేషెంట్లతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లోని పీహెచ్​సీలు, కొవిడ్​ ఐసోలేషన్ సెంటర్లను స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ పరిశీలించారు. పేషెంట్లకు పండ్లను అందజేశారు. ఆర్​అండ్​బీ,  హౌసింగ్​ మినిస్టర్​  వేముల ప్రశాంత్​రెడ్డి, ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​, ఎంపీ బీబీ పాటిల్​, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​ కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లోని కొవిడ్​వార్డులో పర్యటించారు. 

బెల్లంపల్లి ఐసోలేషన్​ వార్డుకు ముగ్గురు ఎమ్మెల్యేలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కరోనా ఐసోలేషన్ వార్డులో ఈ నెల 5,6 తేదీల్లో 12 మంది, 7, 8 తేదీల్లో ఆరుగురు.. మొత్తంగా నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది చనిపోయారు. అప్పట్లో మీడియాలో ఈ వార్తలు ప్రముఖంగా వచ్చినప్పటికీ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలుగానీ, ఎంపీగానీ, ఇతర ప్రజాప్రతినిధులెవరూ కొవిడ్​సెంటర్​ను సందర్శించలేదు. అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తీరా బుధవారం సీఎం కేసీఆర్​  గాంధీ హాస్పిటల్​ను విజిట్​ చేయడంతో గురువారం మంచిర్యాల, చెన్నూర్​, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్​రావు, బాల్క సుమన్​, దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్​ రేణికుంట్ల ప్రవీణ్​, కలెక్టర్​ భారతి హోళికేరితో కలిసి బెల్లంపల్లి కొవిడ్​ ఐసోలేషన్​ వార్డును విజిట్​ చేశారు. కాగా, ఎమ్మెల్యేలు అరగంట పాటు హడావుడి చేసి వెళ్లిపోయారని, అసలు సమస్యలను పట్టించుకోలేదని పేషెంట్ల బంధువులు ఆరోపించారు.