అసంతృప్త నేతలకు స్కీముల ఎర!

అసంతృప్త నేతలకు స్కీముల ఎర!

సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంతో చెలరేగిన అసమ్మతిని చల్లార్చేందుకు ఎమ్మెల్యేలు స్కీములను ఎరవేస్తున్నారు! తాము తెచ్చిన లిస్టులనే ఎమ్మెల్యేలు ఫైనల్​ చేస్తుండడంతో అసంతృప్త నేతలు ఖుషీ అవుతున్నారట! ఈ విషయం కొత్తగూడెం జిల్లాలో హాట్​టాపిక్​గా మారింది. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్​ ఇస్తే తాము బీఆర్ఎస్​కోసం పనిచేసే ప్రసక్తి లేదని ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్​ డి. వెంకటేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు హైకమాండ్​కు అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే! కానీ హైకమాండ్​ హరిప్రియకే టికెట్​ ఇవ్వడంతో అసమ్మతి నేతలు నారాజ్​ అయ్యారు. 

కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్​ నేతలతో రహస్య మంతనాలు జరిపారు. అటు కొత్తగూడెం మున్సిపాలిటీలోనూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు అసమ్మతి గళం ఎత్తుతున్నారు. ఈ మున్సిపాలిటీలోని 24 మంది బీఆర్​ఎస్​ కౌన్సిలర్లలో ఇప్పటికే దాదాపు 12మందికి పైగా కౌన్సిలర్లు కాంగ్రెస్​ నేత పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో టచ్​లోకి వెళ్లారట.  దీంతో అలర్ట్​ అయిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మున్సిపల్​ కౌన్సిలర్లతో పాటు అసమ్మతి నేతలను మచ్చిక చేసుకునేందుకు స్కీమ్స్​లు ఎరవేస్తున్నారనే టాక్​ నడుస్తోంది. కౌన్సిలర్లు చెప్పిన వాళ్లకే రెండో విడత దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ సాయం, 58, 59 స్కీముల్లో ప్రాధాన్యం ఇస్తుండడంతో కామన్ పబ్లిక్​నారాజ్​ అవుతున్నారు.  కౌన్సిలర్లు చెప్పినవాళ్ల పేర్లు కాకుండా అర్హులకు స్కీములు అందేలా చూడాలని కలెక్టర్​కు విన్నవిస్తుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

‑ వెలుగు, భద్రాద్రి కొత్తగూడెం