ఇండ్లు ఉన్నోళ్లకూ గృహలక్ష్మి.. చేతివాటం చూపిస్తున్న ఎమ్మెల్యేలు

ఇండ్లు ఉన్నోళ్లకూ గృహలక్ష్మి..   చేతివాటం చూపిస్తున్న ఎమ్మెల్యేలు
  •     లేనోళ్ల దరఖాస్తులు బుట్టదాఖలు
  •     పక్కదారి పడుతున్న పథకం

సంగారెడ్డి/కొండాపూర్, వెలుగు :పేదల కోసం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం సంగారెడ్డి జిల్లాలో  పక్కదారి పడుతోంది. ఎమ్మెల్యేల మితి మీరిన జోక్యంతో అనర్హులను లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. రాజకీయ ఒత్తిడులు పెరగడంతో నిజమైన లబ్ధిదారుల కన్నా నకిలీలకే ప్రభుత్వ సాయం అందే పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కో గ్రామం నుంచి 50 నుంచి 100 మంది లబ్ధిదారుల పేర్లను సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. వారి సూచనల మేరకే అనర్హులను అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కొన్ని చోట్ల బీఆర్ఎస్ సర్పంచులే  నేరుగా పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యుల పేర్లతో గృహలక్ష్మి పథకాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధికారులు తయారు చేసిన గృహలక్ష్మి జాబితాలో ఈ వివరాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. 

జిల్లాలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీ నుంచి కనీసం 150 నుంచి 400 మంది గృహలక్ష్మి పథకానికి అప్లై చేసుకున్నారు. గ్రామాల స్థాయిని బట్టి అధికారులు లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల రికమండేషన్ లను పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలైన లబ్ధిదారులకు బదులు పెద్ద భవంతులు, డూప్లెక్స్ ఇండ్లు ఉన్నవారు గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారులుగా కనిపిస్తున్నారు.  

వాస్తవానికి సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న పేదలు గృహలక్ష్మి పథకానికి అర్హులు. కానీ ప్రతి గ్రామంలో దాదాపు 25 శాతం మంది లబ్ధిదారులు అనర్హులే ఉన్నట్టు ఇటీవల బయటపడ్డ జాబితాల్లో తెలుస్తోంది.  ఈ క్రమంలో సంగారెడ్డి, పటాన్ చెరు, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో అసలైన బెనిఫిషరీస్ కు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం లీడర్లు వాదిస్తున్నారు. గృహలక్ష్మి పేరుతో బీఆర్​ఎస్​ లీడర్లు మాత్రమే బాగుపడుతున్నారని ఆయా పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

హరిదాసుపూర్ లో..

నియోజకవర్గంలోని  కొండాపూర్ మండలం హరిదాస్పూర్ గ్రామంలో  ఊరూరు తిరిగి బాగోతం ఆడే కుటుంబాలు 15 నుంచి 20 ఉన్నాయి.  వర్షం వస్తే కూలిపోయే స్థితిలో వీరి నివాసాలు ఉండగా పక్కా భవనాల కోసం గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏ ఒక్క కుటుంబానికి ఈ పథకంలో చోటు దక్కలేదు. కానీ ఆ ఊరి సర్పంచ్ బంధువుల్లో మూడు కుటుంబాలకు గృహలక్ష్మి పథకం అర్హుల జాబితాలో చోటు కల్పించారు. అసలైన లబ్ధిదారులను వదిలేసి ఇండ్లు ఉన్న వారిని ఎంపిక చేయడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తమ్మలిబాయ్ తండాలో..

కొండాపూర్ మండలం తమ్మలిబాయ్ తండా సర్పంచ్ పేరును గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. ఆమెకు రెండు అంతస్తుల బిల్డింగ్ ఉంది, అయినా ఆమెను గృహలక్ష్మి పథకంలో ఎందుకు ఎంపిక చేశారని  గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ గ్రామం నుంచి 14 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా అందులో సర్పంచ్ సహా 8 మంది వారి కుటుంబ సభ్యులు ఉండడం విమర్శలకు దారితీస్తోంది.