ఊర్లపొంటి తిరుగుతున్నరు! జనంలోకి ఎమ్మెల్యేలు

ఊర్లపొంటి తిరుగుతున్నరు! జనంలోకి ఎమ్మెల్యేలు
  •     శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవాల పేరిట బిజీ 
  •     కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే సొంత డబ్బులిస్తామని హామీ
  •     అందుబాటులో ఉన్నామని చెప్పుకోవడానికి ఆరాటం
  •     అయినా తప్పని వ్యతిరేకత.. పలుచోట్ల నిలదీస్తున్న జనం

యాదాద్రి, వెలుగు ; ఎన్నికలు సమీపిస్తుండడంతో యాదాద్రి జిల్లాలోని ఎమ్మెల్యేలు పల్లె, పట్టణాల బాట పడుతున్నారు. ఎన్నికల వేళ ఓ పక్క హైకమాండ్ సర్వేలు చేస్తుండడం, మరో పక్క వ్యతిరేకత పెరిగిపోతుండడంతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరిట మూడు నెలలుగా జనాల్లోనే ఉంటున్నారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే తమ సొంత నిధులు ఇస్తామని భరోసా ఇచ్చి పనులు చేయిస్తున్నారు. 

అయినప్పటికీ జనాల్లో వ్యతిరేకత తగ్గడం లేదు.  సమస్యలపై అనేక చోట్ల  ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. వారికి ఏదోవిధంగా నచ్చిజెపుతూ ముందుకు సాగుతున్నా.. తాము గెలుస్తామా..? లేదా..? అనే సందేహం మాత్రం వారిలో పోవడం లేదు.  దీంతో సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 

హ్యాట్రిక్ లక్ష్యంగా..

యాదాద్రి జిల్లాలోని  భుననగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్​రెడ్డి, గొంగిడి సునీత వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారి బరిలో నిలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో భాగంగా నిత్యం జనాలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మార్చి నుంచి మే వరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి కేడర్‌‌‌‌తో మమేకమయ్యారు.

 ఇదే సమయంలో అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు కూడా చేశారు.  తర్వాత పెండ్లిండ్ల సీజన్​ రావడంతో సాధ్యమైనంత ఎక్కువ కార్యకర్తల పెళ్లిళ్లకు హాజరవుతూ వచ్చారు. ఆ తర్వాత సీఎం కప్​ పేరుతో ఆటల పోటీలు,  జూన్​ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. 

సొంత నిధులిస్తామంటూ..

మూడు నెలల కిందటి వరకు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా నడిచింది. కానీ, ఎన్నికలు సమీపిస్తుండడంతో అలర్ట్‌‌గా ఉండాలని హైకమాండ్ ఆదేశించడంతో దశాబ్ది ఉత్సవాలు అయిపోగానే..  తమ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో నిత్యం పర్యటనలు చేపడుతున్నారు. ప్రతిరోజు రెండు మండలాల్లోని పలు గ్రామాలను ఎంచుకొని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అయితే పాత పనుల బిల్లులు పెండింగ్‌‌లో ఉండడంతో చాలాచోట్ల కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 

ఇలాంటి చోట్ల బిల్లులు రాకుంటే సొంత నిధులు ఇస్తామని వారికి చెప్పి పనులకు ఒప్పిస్తున్నారు.  ఎప్పుడూ బిజినెస్​ పనుల్లో నిమగ్నమై బిజీగా ఉండే ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి ఇప్పుడు పూర్తిగా భువనగిరినే అంటిపెట్టుకొని ఉంటుండడం గమనార్హం. అనేక గ్రామాల్లో సొంత డబ్బులతో ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

అడ్డగింతలు.. అసహనాలు

నియోజకవర్గ పర్యటనలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌‌ రెడ్డికి పలుమార్లు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. భూదాన్ పోచంపల్లిలో రోడ్డు నిర్మాణంపై బాధితులు, భువనగిరి మున్సిపాలిటీలో డెవలప్మెంట్ వర్క్స్ శంకుస్థాపనకు వెళ్లగా బీజేపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. తాజాగా భువనగిరి మండలం అనంతారంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్లగా దళితబంధు ఇప్పించాలని కాంగ్రెస్ క్యాడర్ , గ్రామస్తులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 

అయితే ఆమె ప్రజలు సమస్యలపై ప్రశ్నిస్తే అసహనం వ్యక్తం చేస్తుండడం వివాదాస్పదంగా మారుతోంది. యాదగిరిగుట్ట మండలంలో నిర్వహించిన సభలో ప్రజలకు స్వర్గాన్ని కిందికి దించినా తృప్తి ఉండదంటూ కామెంట్ చేశారు. ఆత్మకూరు మండలంలో కల్యాణ లక్ష్మి గురించి ప్రశ్నించిన మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గుండాలలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి కెనాల్‌ గురించి అడగగా అసహనం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన తర్వాత సమస్య గురించి చెప్పాలని సూచించారు.