ఇవాళ సిట్ ముందుకు లాయర్ ప్రతాప్ గౌడ్

ఇవాళ సిట్ ముందుకు లాయర్ ప్రతాప్ గౌడ్
  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్
  • నందు లావాదేవీలపై భార్య చిత్రలేఖను  ప్రశ్నించే ఛాన్స్

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ విచారణలో వేగం పెంచుతోంది. ఇవాళ లాయర్ ప్రతాప్ గౌడ్, నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖను సిట్ ప్రశ్నించనుంది. నిందితులతో ఎలాంటి సంబంధాలు, లావాదేవీలు ఉన్నాయన్న కోణంలో విచారించనున్నట్లు సమాచారం. సిట్ నోటీసులపై స్టే ఇవ్వాలంటూ ప్రతాప్ గౌడ్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ సిట్ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. 

నిందితుడు కాకపోయినా 41ఏ సీఆర్పీసీ  కింద సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ప్రతాప్ తప్పుబట్టారు. అయితే కారణాలు ఉండడం వల్లే నోటీసులు ఇచ్చామని సిట్ హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ లాయర్ ప్రతాప్ సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రతాప్ గౌడ్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సిట్ ను ఆదేశించింది.

సింహయాజీ, రామచంద్ర భారతితో సంబంధాలపై ప్రతాప్ గౌడ్ ను సిట్ అధికారులు ఆరా తీయనున్నారు. మరోవైపు నందకుమార్ భార్య చిత్రలేఖ కూడా సిట్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ విచారణకు రావాలని గతంలోనే సిట్ ఈ ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. నందకుమార్ ఆర్థిక లావాదేవీలపై ఆయన భార్యను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే కేసులో బీఎల్ సంతోష్ సహా తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ పై సిట్ మొయినాబాద్ పీఎస్ లో కేసులు నమోదు చేసింది.

ఈనెల 29వ తేదీన ఏపీ ఎంపీ రఘురామ రాజు విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో బీఎల్ సంతోష్ కు మరోసారి 41ఏ సీఆర్పీసీ కింద సిట్ నోటీసులిచ్చింది. ఈనెల 26 లేదంటే 28న విచారణకు హాజరవ్వాలని సిట్ నోటీసులు జారీ చేసింది.