వీడియో: తండ్రి అడుగుజాడల్లోనే తనయుడు.. అదే యాక్షన్.. అవే యార్కర్లు

వీడియో: తండ్రి అడుగుజాడల్లోనే తనయుడు.. అదే యాక్షన్.. అవే యార్కర్లు

క్రికెట్ ప్రపంచంలోకి ఎంతమంది బౌలర్లు వచ్చినా.. శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బౌలింగ్ శైలి ప్రత్యేకమనే చెప్పాలి. బంతిని రాకెట్‌లా విసరటం తన బలమైతే.. యార్కర్ల రూపంలో వికెట్లకు గురిపెట్టి వేయగల సత్తా అతనికే సాధ్యం. ప్రస్తుతానికి క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఈ మాజీ దిగ్గజం.. ప్రాంచైజీ క్రికెట్‌లో పలు జట్లకు బౌలింగ్ కోచ్ గా సేవలందిస్తున్నారు. 

ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి తనయుడు డువిన్ మలింగ ఎంట్రీ ఇచ్చారు. అయితే కొడుకు కూడా అచ్చం తండ్రి లాగానే బౌలింగ్ చేయటం గమనార్హం. యార్కర్ల రూపంలో గురిపెట్టి వికెట్లను గిరాటేస్తున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ ఎంఐ న్యూయార్క్ జట్టుకు మలింగ కోచ్‌గా సేవలందిస్తున్నారు.  ఈ క్రమంలో ముంబై ఆటగాళ్లతో కలిసి నెట్ సెషన్ ‌లో పాల్గొన్న డువిన్.. బౌలింగ్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

2019లో వన్డేల నుంచి తప్పుకున్న మలింగ.. 2011లో టెస్ట్‌ క్రికెట్‌కు, 2021లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.  శ్రీలంక తరుపున 228 వన్డేలు, 30 టెస్టులు ఆడిన ఈ యార్కర్ కింగ్.. వన్డేల్లో 338 వికెట్లు, టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టారు. ఇక 84 టీ20లు ఆడిన మలింగ 107 వికెట్లు తీసుకున్నారు. మొత్తంగా మలింగ.. తన అంతర్జాతీయ కేరిర్‌లో 546 వికెట్లు సాధించారు. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లను రెండుసార్లు పడగొట్టిన రికార్డు ఒక్క మలింగ పేరిటే నమోదై ఉంది. మలింగ కెప్టెన్సీలో శ్రీలంక జట్టు 2014లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది.