కవితకు చుక్కెదురు.. సీబీఐ విచారణపై స్టేకు కోర్టు నో

 కవితకు చుక్కెదురు.. సీబీఐ విచారణపై స్టేకు కోర్టు నో
  • పూర్తి వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడి
  • కవిత పిటిషన్​పై రిప్లై ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశం
  • ఏప్రిల్ 10న వాదనలు వింటామన్న ట్రయల్ కోర్టు
  • తీహార్ జైల్లో దాదాపు 3 గంటలపాటు కవితను విచారించిన సీబీఐ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ విచారణను అనుమతించొద్దని కోరుతూ ట్రయల్​ కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఈ విషయంలో తాత్కాలిక ఊరట కల్పించేందుకు స్పెషల్ జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. సీబీఐ విచారణకు అనుమతిస్తూ తాజాగా ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు అంగీకరించలేదు. అయితే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై రిప్లై ఇవ్వాలని సీబీఐ అధికారులను ఆదేశించారు.  కవిత పిటిషన్ పై ఈ నెల 10 (బుధవారం)న విచారణ చేపడతామని స్పష్టం చేశారు. జ్యుడీషియల్​ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ విచారించేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ శనివారం కవిత తరఫు సీనియర్ అడ్వొకేట్ విక్రమ్ చౌదరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కవిత విచారణపై సీబీఐ ఈ నెల 5 వ తేదీన ట్రయల్ కోర్టును ఆశ్రయించిందని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ దరఖాస్తు పై కానీ, విచారణపై కూడా తమకెలాంటి సమాచారం అందించలేదన్నారు. ప్రతివాది కవిత తరపు ఎలాంటి వాదనలు లేకుండానే.. సీబీఐ కోరినట్టు విచారణకు కోర్టు అనుమతించిందని, ప్రతివాదికి సమాచారం లేకుండా ఉత్తర్వులు రిలీజ్ చేయొద్దని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఉన్నదని గుర్తు చేశారు. అందువల్ల ట్రయల్ కోర్టు శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులు రీకాల్ చేయాలని కోరుతున్నట్టు విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈ వాదనలపై సీబీఐ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం తెలిపారు. కవిత పిటిషన్ పై రిప్లై ఇచ్చేందుకు మూడు రోజుల సమయం కోరారు.

 తదుపరి విచారణ ఈ నెల 10 వ తేదీన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మధ్యలో జోక్యం చేసుకున్న చౌదరి.. అప్పటి వరకు కవితను విచారించకుండా మెరిట్స్ ఆధారంగా స్టే ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తి పై స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా స్పందిస్తూ.. ‘పిటిషన్ పై వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఇస్తాం. ఎలాంటి వాదనలు వినకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వడం కుదురదు’అని స్పష్టం చేశారు. కాగా, ఈ వాదనలపై సాయంత్రం 5:20 గంటలకు ఈ-మెయిల్ ద్వారా వాది, ప్రతివాదులకు ఆర్డర్ కాపీ పంపినట్టు కవిత తరపు అడ్వొకేట్లు తెలిపారు. సీబీఐ విచారణపై స్టే అవసరం లేదని తెలిపారన్నారు. అయితే కవితను విచారించాలన్న సీబీఐ విజ్ఞప్తికి మాత్రమే అనుమతించామని, దీంతో కస్టడీలో ఉన్న కవితకు ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందని ఆర్డర్ కాపీలో జడ్జి ప్రశ్నించినట్టు ఉందన్నారు.

జైల్లో కవితను విచారించిన సీబీఐ... తప్పుపట్టిన కవిత అడ్వొకేట్

తీహార్ జైల్లో ఉన్న కవితను శనివారం సీబీఐ విచారించింది. తాము పెట్టుకున్న అప్లికేషన్ కు ట్రయల్ కోర్టు అనుమతివ్వడంతో ఎలాంటి ఆలస్యం లేకుండా ఇంటరాగేషన్ మొదలు పెట్టింది. శనివారం మధ్యాహ్నం 12:30గంటల నుంచి 3:30 గంటల వరకు జైల్లోనే ఆమెను విచారించినట్టు కవిత తరపు అడ్వొకేట్​ మోహిత్ రావు తెలిపారు. అయితే సీబీఐ అధికారులు కవితను విచారించడాన్ని ఆయన తప్పు బట్టారు. ఉదయం 10 గంటలకే సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తాము ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. అనంతరం కోర్టులో ఈ పిటిషన్ పై వాదనలు జరిగినట్టు చెప్పారు. 

కోర్టులో వాదనలపై సాయంత్రం 5: 20 గంటలకు కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. కానీ అంతకన్నా ముందే సీబీఐ ఎలా కవితను విచారిస్తుందని ప్రశ్నించారు. అంటే ఆర్డర్ ఇలాగే వస్తుందని సీబీఐ కి ముందే తెలుసా? అని ప్రశ్నించారు. ఈడీ కేసులో కవితకు వారం, 10 రోజులు బెయిల్ వస్తుందనే ఉద్దేశంతోనే కవితను సీబీఐ అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నట్టు భావిస్తున్నామన్నారు. కవితను అరెస్ట్ చేసేందుకే సీబీఐ వచ్చిందని, కానీ తాజాగా తాము దాఖలు చేసిన అప్లికేషన్ తో ఆ ఆలోచన విరమించుకున్నదని అన్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ రెండు కలిసి పని చేస్తున్నట్టు అర్థం అవుతుందన్నారు. కవిత అరెస్ట్ విషయంలోనూ ఈడీ ఇలాగే వ్యవహరించిందని తెలిపారు. కవిత విచారణ అంశాన్ని తదుపరి విచారణ సందర్భంగా కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు.

ఆధారాలపైనే ఫోకస్ 

దాదాపు మూడు గంటల పాటు సీబీఐ చేసిన ఇంటరాగేషన్ లో లిక్కర్ స్కాం ఆధారాలపైనే ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. ఇప్పటి వరకు కేవలం సహ నిందితులు, అప్రూవర్ల వాంగ్మూలాల పైనే కవిత, కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. దీంతో అసలు కవిత ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారో చూపేందుకు ఆధారాలు సేకరిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం కవిత ను విచారించిన సీబీఐ.. బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై, శరత్ చంద్రా రెడ్డి వాంగ్మూలాలపై ఆరా తీసినట్టు సమాచారం. ముఖ్యంగా కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. రూ.100 కోట్లు హవాలా రూపంలో మళ్లించిన అంశాలు, సౌత్ గ్రూప్ లో సభ్యుల పాత్రపై ఎంక్వైరీ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.