
మహబూబ్‌నగర్ (నారాయణపేట), వెలుగు : నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనుల్లో తట్ట మట్టి తీయకున్నా రూ. 600 కోట్ల అడ్వాన్స్ ఎలా ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలోని నారాయణపేట, కొడంగల ఎత్తిపోతల స్కీమ్ బాధితులతో గురువారం ఆమె మాట్లాడారు. ఎత్తిపోతల పనుల్లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు ఇస్తామని ప్రారంభోత్సవం టైంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిస్తే.. రూ. 14 లక్షలే ఇస్తామని ఓ ఆఫీసర్ చెప్పడంలో ఆంతర్యం ఏమిటన్నారు.
సీఎం మాటకు విలువ ఉందా ? లేదా అన్ని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలన్నారు. కరివేన ప్యాకేజీని రద్దు చేసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల 1.8 లక్షల ఎకరాల ఆయకట్టు నుంచి లక్ష ఎకరాలకు తగ్గిందన్నారు. కవిత వెంట బాపన్ పల్లి మాజీ సర్పంచ్ గవినోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, సాయిరెడ్డి, సుభాష్, గౌని శ్రీను, బాలకృష్ణారెడ్డి, జ్ణానేశ్వర్, దానప్ప పాల్గొన్నారు.