కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే.. అధిష్టానాన్ని కలువనీయలే : కవిత

కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే.. అధిష్టానాన్ని కలువనీయలే  : కవిత

 

  • కోటరీనే  ముంచేసింది 
  • కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే.. అధిష్టానాన్ని కలువనీయలే 
  • బీఆర్​ఎస్​ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత 
  • దళితబంధు సహా ఇతర స్కీముల్లోనూ కోటరీకే ప్రయారిటీ ఇచ్చారని కామెంట్​

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్​ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న కోటరీనే పార్టీని నిండా ముంచేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని, పార్టీ అధిష్టానాన్ని కలవకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారని  పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి తనతో సన్నిహితంగా ఉన్న కార్యకర్తలెవరైనా వచ్చి తనను కలిస్తే వాళ్లను అప్పటి ఎమ్మెల్యేలు వేధింపులకు గురి చేశారని ఆమె అన్నారు. ‘‘అక్కడికే వెళ్లారు కదా.. ఇంకా మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు.. పనులు కూడా అక్కడికే పోయి చేయించుకోండి” అని వారిని నిర్లక్ష్యం చేశారని తెలిపారు.

 సోమవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన నిజామాబాద్​లోక్​సభ స్థానం సన్నద్ధత సమావేశంలో కవిత మాట్లాడారు. దళితబంధు లాంటి పథకాలతో గ్రామస్థాయిలో ఉపాధి కల్పించే పనులు చేయకుండా కోటరీకి, వాళ్లు చెప్పిన వాళ్లనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, పథకం అందినవాళ్లు కూడా పూర్తి స్థాయిలో పార్టీకి అండగా నిలువలేదని అన్నారు. ఇతర సంక్షేమ పథకాలను కూడా అర్హులకు కాకుండా చుట్టూ ఉన్న వారికి ఇవ్వడానికే అప్పటి ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.

 కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం, కోటరీకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్​కు అండగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్​లో ఓటమికి దారి తీసిందని తెలిపారు. ఇప్పటికైనా ఓడిన నాయకులతో పాటు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని కవిత సూచించారు. వారి తీరులో మార్పు రాకుంటే పార్టీ అధినాయకత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు. లోక్​సభ ఎన్నికల్లో నిజామాబాద్​సీటు గెలిచి కేసీఆర్​కు గిఫ్ట్​గా ఇవ్వాలని, అందరూకలిసికట్టుగా పనిచేస్తే గెలుపు ఈజీ అని ఆమె తెలిపారు.

కేసీఆర్​ కూతురు ఓడినా రివ్యూ చేయరా?: మహిళా నేతలు

‘‘గత లోక్​సభ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ కూతురు ఓడినా.. అందుకు కారకులెవరో తెలిసినా కనీసం రివ్యూ కూడా చేయరా?” అని సమావేశంలో పలువురు మహిళా నేతలు ప్రశ్నించారు. అప్పుడే కవిత ఓటమికి కారుకులైన వారిపై చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. నిజామాబాద్​కార్పొరేషన్​లో 28 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచినప్పుడు కూడా అలాంటి ఫలితం ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఎంతసేపు కార్పొరేషన్​పీఠం ఎలా దక్కించుకోవాలనే ఆలోచన తప్ప ప్రజలు ఎందుకు అలాంటి తీర్పునిచ్చారని సమీక్ష చేయలేదని, ఏ ఒక్క నాయకుడిని కూడా పిలిచి మాట్లాడలేదని అన్నారు.

 ‘‘నిజామాబాద్ ​ఎంపీ అర్వింద్​ కేసీఆర్​ కూతుర్ని పట్టుకొని అనైతికంగా మాట్లాడినప్పుడు పార్టీ అధినాయకత్వం ఎందుకు మౌనంగా ఉంది? అదే రోజు అర్వింద్​వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం, జిల్లా మంత్రి స్పందించి ఉంటే మాలాంటి కార్యకర్తలకు మనోధైర్యం దక్కేది. కేసీఆర్​ కూతురికే పార్టీలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే సాధారణ కార్యకర్తలకు రక్షణ ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి కదా?’’ అని ప్రశ్నించారు. 

పార్టీలో కేసీఆర్​తర్వాతి స్థానంలో ఉన్న వాళ్లను తాము కలిసేందుకు ప్రయత్నిస్తే అపాయింట్​మెంట్​ఇవ్వలేదని, సదరు నాయకుడి పీఏ తమ ఫోన్లు కూడా లిఫ్ట్ ​చేయలేదని.. పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేడర్​కు తాము ఎట్ల భరోసా ఇవ్వగలమో చెప్పాలని అన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్​కు నిజామాబాద్​ జిల్లా అండగా నిలిచిందని, అధికారంలో ఉండి కూడా కార్యకర్తలకు ఏమీ చేయకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయన్నారు. తామంతా కలిసి ఎంపీగా కవితను గెలిపించుకుంటామని, నేతలెవరైనా కుట్రలు చేస్తే వాటిని బయట పెడుతామని మహిళా నేతలు చెప్పారు.