చౌటుప్పల్, వెలుగు: సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ నెల18న ఖమ్మం నగరంలో 5 లక్షల మందితో నిర్వహించే ‘భారీ బహిరంగ సభ’కు అన్నివర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బహిరంగ సభకు 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారన్నారు.
వంద సంవత్సరాల త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన భారత స్వాతంత్రోద్యమంలో అనేక నిషేధాజ్ఞలు ఎదుర్కొన్నామన్నారు. ఎన్నో విజయాలు సాధించి దేశ రాజకీయ చరిత్రలో సీపీఐ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.
సీపీఐ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలకు ప్రజలు అన్ని వర్గాల వారు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, పల్లె శేఖర్ రెడ్డి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు దుబ్బాక భాస్కర్, మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, పిల్లి శంకర్, టంగుటూరు రాములు, బద్దుల సుదాకర్, దాసరి మనోహర్ పాల్గొన్నారు.
