నాటు నాటు సాంగ్ కు 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డ్

నాటు నాటు సాంగ్ కు 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డ్

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డును ట్రిపుల్ ఆర్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీలోని 'నాటు నాటు' పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. దాంతో పాటు ఇక ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా ట్రిపుల్ ఆర్ సినిమా నామినేట్‌ అయింది.

ప్రస్తుతం గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం కాలిఫోర్నియాలో జరుగుతోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో డైరెక్టర్ రాజమౌళి, నటుసు రామ్ చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. 'నాటు నాటు'కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్‌, రాజమౌళి, చరణ్‌ చప్పట్లు కొడుతూ సందడి చేశారు. 

ఈ సందర్భంగా ఇది ఎంతో అపూర్వమైన, చారిత్రాత్మక విజయమని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కీరవాణికి, మూవీ టీమ్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది అంటూ ప్రశంసలు గుప్పించారు. దాంతో పాటు అవార్డ్స్ ఫంక్షన్ లో కీరవాణి మాట్లాడుతున్న ఫొటోను చిరు షేర్ చేశారు.