వైద్య సిబ్బందిని ఎప్పుడు కేటాయిస్తరు?

వైద్య సిబ్బందిని ఎప్పుడు కేటాయిస్తరు?

దుబ్బాక, వెలుగు : దుబ్బాకలోని 30 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్​గ్రేడ్​ చేసి ఏడాది గడుస్తున్నా నేటికీ వైద్య సిబ్బందిని ఎందుకు కేటాయించలేదని, ఎప్పుడు కేటాయిస్తారో చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు. ఆదివారం దుబ్బాక వంద పడకల ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కింది స్థాయి ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు 24 గంటల వైద్య సేవలను అందించాలని, సెలవు రోజుల్లో ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఉండడం లేదని తమ దృష్టికి వచ్చిందని, వీక్లీ ఆఫ్​లు తప్ప ఇతర సెలవులు ఇవ్వొద్దని సూపరింటెండెంట్ ​హేమ్​రాజ్​ సింగ్​కు ఎమ్మెల్యే సూచించారు. ఈ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కింద 91 పోస్టులను మంజూరు చేస్తూ జీవో జారీ చేసినా నేటికీ ఒక్క పోస్ట్​కూడా భర్తీ చేయలేదన్నారు.

30 పడకల ఆసుపత్రిలో ఉన్న సిబ్బందితోనే 100 పడకల ఆసుపత్రిని నిర్వహించడంతో వైద్య సిబ్బంది ఒత్తిడితో రోగులతో దురుసగా ప్రవర్తించే అవకాశం ఉందన్నారు. ఆసుపత్రికి రూ. 52.50 లక్షల విలువైన డయాలిసిస్​ పరికరాలను ప్రభుత్వం అందజేసిందని, డయాలిసిస్​ సెంటర్​ను త్వరలోనే రాష్ట్ర వైద్య శాఖ మంత్రితో కలిసి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం వెలుగు దినపత్రిక క్యాలెండర్​ను ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కిష్టంగారి సుభాష్​రెడ్డి, మట్ట మల్లారెడ్డి, దూలం వెంకట్​గౌడ్, సుంకోజు ప్రవీణ్, సంపంగి అశోక్, దేవుని ఉపేందర్, పల్లె నేహాల్​గౌడ్​భద్రి, సప్తగిరి పాల్గొన్నారు.

చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండాలి 
సిద్దిపేట రూరల్, వెలుగు : విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ ముందుండాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, అడిషనల్ డీసీపీ మహేందర్ సూచించారు. సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం తడకపల్లిలో మూడు రోజులుగా కొనసాగిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. 

ముగింపు సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి విద్యార్థుల తల్లిదండ్రులు కాన్వెంట్ స్కూళ్లు, కార్పొరేట్ ఏసీ సౌకర్యం కలిగిన  స్కూళ్ల వైపు మెగ్గుచూపుతున్నారు తప్ప ఆటలు, మైదానం గురించి ఆలోచించడం లేదన్నారు. దాని వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరిగుతుందని తెలిపారు. నేటి విద్యార్థులు అన్నింట్లోను ముందుండాలని సూచించారు. డీసీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో జాతీయతా భావం, దేశభక్తిని పెంపొందిస్తాయన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు వారు బహుమతులు అందజేశారు. కాగా, రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1150 మంది క్రీడాకారులు వివిధ రకాల ఆటల్లో పాల్గొనగా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఓవరాల్ చాంపియన్​ షిప్ గా బీహెచ్ఈఎల్ వీబీహెచ్ఎస్ జోన్ జట్టు నిలిచింది. ఈ ముగింపు వేడుకల్లో సరస్వతి విద్యాపీఠం ప్రాంత కార్యదర్శి ముక్కాల సీతారాములు, ప్రాంత సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు తడకమడ్ల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.