
ఢిల్లీ ఎన్నికల ప్రచారం, CAA నిరసనల్లో ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ రోజు ఆయన్ని డిఫెండ్ చేశారు. మోడీపై పాక్ మంత్రి చేసిన కామెంట్స్‌ను తిప్పికొట్టారు. అంతర్గతంగా మేం ఎన్నైనా అనుకుంటాం.. బయటివాడొచ్చి మా ప్రధానమంత్రిని ఏమైనా అంటే ఉరుకోబోమంటూ ఫైరయ్యారు కేజ్రీవాల్. ‘మా దేశ అంతర్గత వ్యవహారంలో ఓ ఉగ్రవాద రాజ్యం జోక్యాన్ని మేం సహించం’ అని హెచ్చరించారు.
మోడీ మ్యాడ్‌నెస్ అంటూ పాక్ మంత్రి కామెంట్స్
పాకిస్థాన్‌పై యుద్ధం వస్తే వారంలోగా ఆ దేశాన్ని చిత్తుగా ఓడించగలమని ప్రధాని మోడీ ఇటీవలే కామెంట్ చేశారు. దీనిపై పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ రియాక్ట్ అయ్యారు. ‘ఒక్కొక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతుండడంతో మోడీ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్నే నాశనం చేస్తానని బెదిరిస్తున్నారు. ఎకనమిక్ స్లో డౌన్, కశ్మీర్, CAA అంశాల్లో దేశంలో నుంచి, బయటి నుంచి విమర్శలు రావడంతో మోడీ బ్యాలెన్స్ తప్పుతున్నారు. ఇప్పుడు మరో రాష్ట్రం ఢిల్లీలో ఓటమి భయం ఆయన్ని వెంటాడుతోంది. భారత ప్రజలు మోడీ మ్యాడ్‌నెస్‌ను ఓడించాలి’ అని పాక్ మంత్రి అన్నారు.
మా దేశంలో వేలుపెట్టొద్దన్న కేజ్రీవాల్
పాక్ మంత్రి ఫవాద్ కామెంట్స్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోడీజీ భారత ప్రధాని, ఆయన మాకూ ప్రధానమంత్రి. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో ‘ఉగ్రవాద సంస్థ ఆర్గనైజర్’ వేలుపెడితే ఊరుకోబోం’ అని హెచ్చరించారు కేజ్రీవాల్. భారతీయుల ఐక్యతను దెబ్బతీయాలన్ని పాక్ ఎంతగా ప్రయత్నించినా ఏమీ చేయలేదని చెప్పారు.