
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభమైంది. మన పంజాబ్‌లోని డేరా బాబా నానక్ గుడితో పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను కలిపే కారిడార్ డోర్లు శనివారం తెరుచుకున్నాయి. ఇటుపక్క ప్రధాని నరేంద్ర మోడీ, అటు పక్క పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారికంగా ప్రారంభించారు. మోడీ జెండా ఊపి మొదటి బ్యాచ్ టూరిస్టులను అక్కడికి పంపితే, హాట్ ఎయిర్ బెలూన్లతో కర్టెన్లను పైకి లాగి కారిడార్‌ను ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. ఇమ్రాన్‌కు మోడీ థాంక్స్ చెబితే, ఇమ్రాన్ ఖానేమో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి విమర్శలు చేశారు.
కర్తార్పూర్ కారిడార్‌పై ప్రధాని మోడీ
జెండా ఊపి టూరిస్టులను పంపిన ప్రధాని
“పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు థాంక్స్. కర్తార్పూర్ కారిడార్‌పై ఇండియా ఫీలింగ్స్‌ను ఆయన అర్థం చేసుకున్నారు. గౌరవం ఇచ్చారు. కారిడార్ తొందరగా పూర్తయ్యేందుకు సహకరించిన పాకిస్థాన్ వర్కర్లకూ నా థాంక్స్” ఇదీ కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాటలు. శనివారం పంజాబ్‌లోని డేరా బాబా నానక్ దగ్గర 500 మందికి పైగా సిక్కు టూరిస్టులను జెండా ఊపి కారిడార్లోకి పంపించారు. తర్వాత అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని శిఖార్ మసియాన్లోని బీఎస్ఎఫ్ క్యాంపులో మాట్లాడారు. కేవలం సిక్కులకే కాకుండా మానవాళి మొత్తానికి స్ఫూర్తి నింపిన గొప్ప వ్యక్తి గురు నానక్ దేవ్ అని ఆయన కొనియాడారు. నవంబర్ 12న గురు నానక్ 550 జయంతి ఉత్సవాలు జరగడానికి కొన్ని రోజుల ముందే కారిడార్‌ను ఓపెన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. కారిడార్‌ను జాతికి అంకితం ఇచ్చారు. ఈ కారిడార్‌తో గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో గురునానక్‌ను దర్శించుకోవడం మరింత సులభమవుతుందన్నారు. ఇంతటి పవిత్రమైన నేలపై అడుగుపెట్టినందుకు తనకు ఆనందంగా ఉందని, మీరందరూ కరసేవ చేసేటప్పుడు ఎలాంటి ఆనందం పొందుతారో తనకూ అలాగే ఉందని అన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) ఇచ్చిన కౌమి సేవ అవార్డును గురు నానక్దేవ్కే అంకితమిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ గవర్నర్ వీపీ సింగ్ బద్నోరే, సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్, ఎస్జీపీసీ చీఫ్ గోవింద్ సింగ్ లోంగోవాల్ హాజరయ్యారు.
మళ్లీ ఇమ్రాన్ కాశ్మీర్ పాట
అది భూవివాదం కాదు..
మానవ సంక్షోభం
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభంలో ఇమ్రాన్
కర్తార్పూర్ (పాక్):
‘‘కాశ్మీరీలను జంతువుల్లా చూస్తున్నారు. కాశ్మీర్ కేవలం భూవివాదమే కాదు. అదో మానవ సంక్షోభం. 9 లక్షల మంది సైనికులను పెట్టి హక్కులను కాలరాస్తున్నారు” ఇదీ కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా మన దేశంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన విమర్శలు. శనివారం ఆయన పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను ప్రారంభించారు. హాట్ ఎయిర్ బెలూన్లతో కర్టెన్లను పైకి లేపి కారిడార్‌ను తెరిచారు. ఈ కార్యక్రమానికి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు పంజాబ్ మాజీ మంత్రి నవజోత్‌సింగ్ సిద్దూ హాజరయ్యారు. ఇండియా నుంచి వచ్చిన మొదటి బ్యాచ్ టూరిస్టులకు ఇమ్రాన్ స్వాగతం పలికారు. ‘‘కర్తార్‌పూర్‌కు ఉన్న ప్రాధాన్యమేంటో నాకు నిజంగా తెలియదు. ఓ ఏడాది కింద మాత్రమే నాకు దీని గురించి తెలిసింది. మీ కోసం ఈ కారిడార్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది” అని అన్నారు. కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని, కాశ్మీర్ ప్రజలకు కమ్యూనికేషన్ కట్ చేయడాన్ని తప్పుబట్టిన ఆయన, కాశ్మీరీలకు న్యాయం జరగాలని అన్నారు. ‘‘కాశ్మీర్ సమస్యలో ఇండియా, పాకిస్థాన్ మధ్య 70 ఏళ్లుగా ద్వేషం రగులుతూనే ఉంది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకుంటే రెండు దేశాలు సంతోషంగా ఉంటాయి. ఒకరికొకరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందొచ్చు” అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. రెండు దేశాల మధ్య అతి త్వరలోనే సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నానన్నారు. కారిడార్‌ను ఓపెన్ చేయడం ప్రేమ, శాంతికి సంకేతంగా నిలుస్తాయని పాక్ మత వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్ హఖ్ ఖాద్రి అన్నారు. ‘‘బెర్లిన్ గోడను కూల్చ గలిగారు. కర్తార్పూర్ కారిడార్‌ను ఓపెన్ చేశాం. మరి, లైన్ ఆఫ్ కంట్రోల్నూ పూర్తిగా చెరిపేయలేమా? దాన్ని కూడా చెరిపేసేయొచ్చు” అని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషి అన్నారు. కాగా, మనసులు గెలుచుకున్నావ్ అంటూ ఇమ్రాన్ ఖాన్‌ను సిద్దూ మెచ్చుకున్నారు. కాగా, కర్తార్పూర్ కారిడార్ ప్రారంభంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మన్మోహన్ సింగ్ అన్నారు. కారిడార్‌ను ప్రారంభించి ఇమ్రాన్ చరిత్ర సృష్టించారని నవ్‌జోత్ సింగ్ సిద్దూ అన్నారు. అలెగ్జాండర్ భయపెట్టి ప్రపంచాన్ని గెలిస్తే, ఇమ్రాన్ మనసుతో గెలిచారని కొనియాడారు.