కరోనా కట్టడికి మోడీ ఫార్ములా.. 3 రోజులు వ్యాక్సిన్ ఫెస్టివల్

కరోనా కట్టడికి మోడీ ఫార్ములా.. 3 రోజులు వ్యాక్సిన్ ఫెస్టివల్
  • ఈనెల 11 -14 మధ్య వ్యాక్సిన్ ఫెస్టివల్
  • వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇంకా పోరాడాల్సి ఉంది
  • వచ్చే 2, 3 వారాల పాటు కరోనాపై గట్టిగా యుద్ధం చేద్దాం
  • ఇందుకోసం రాష్ట్రాల సీఎంలు అన్ని రకాల ప్రయత్నాలను చేయాలి - ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల11 నుంచి 14వ తేదీ వరకూ వ్యాక్సిన్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ పై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో మైక్రో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ ఒక్కటే వైరస్ కు చెక్ పెట్టేందుకు ఉన్న ఉత్తమ స్ట్రాటజీ అని తెలిపారు. కంటైన్ మెంట్ జోన్లలో దీనిని తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేశారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రజలు, డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్ల భాగస్వామ్యం ఎంతో హెల్ప్ అయిందన్నారు. ‘‘గతేడాది వ్యాక్సిన్ కూడా లేకపోయినా మనం కరోనా ఫస్ట్ వేవ్ ను జయించాం. ఇప్పుడు సెకండ్ వేవ్ ను కూడా కంట్రోల్ చేయగలం” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ టెస్టులు చేయించుకోవాలని, 45 ఏళ్లు దాటిన వారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రధాని కోరారు. 

కరోనాపై పోరులో అనుభవం పెరిగింది
కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో మైక్రో కంటైన్ మెంట్ జోన్లను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పారు. గతేడాది కరోనాపై పోరాటానికి పెద్దగా వనరులు లేనందున లాక్ డౌన్ పెట్టడం తప్ప వేరే అవకాశం లేకపోయిందన్నారు. ఇప్పుడు దేశానికి వ్యాక్సిన్ లతో సహా అన్ని వనరులు సమకూర్చుకున్నామని, కరోనాను కట్టడి చేయడంలో అనుభవం, మంచి స్ట్రాటజీ ఉన్నందున లాక్ డౌన్ అవసరం లేదన్నారు.  ‘‘నైట్ కర్ఫ్యూను ప్రపంచమంతా ఆమోదించింది. ఇప్పుడు కర్ఫ్యూ అంటే.. మనం కరోనా కాలంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేస్తోంది” అని ఆయన చెప్పారు. ‘‘కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ ఒక ఆల్టర్నేటివ్. అయితే నైట్ కర్ఫ్యూ అని కాకుండా కరోనా కర్ఫ్యూ అని పిలుచుకుంటే బాగుంటుంది. దీనివల్ల మనం కరోనా విషయంలో అలర్ట్ అవుతాం” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న రాష్ట్రాలను ప్రధాని సమర్థించారు. కరోనా కర్ఫ్యూను రాత్రి 9 లేదా 10 గంటల తర్వాతే ప్రారంభించాలని, ఉదయం 5 లేదా 6 లోపు ముగించాలని సూచించారు. 
కేసులెక్కువైనా సరే.. టెస్టులు పెంచాలె
‘‘పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చినా సరే టెస్టులు  ఎక్కువగా చేయండి” అని సీఎంకు ప్రధాని స్పష్టం చేశారు. ‘‘అందరూ టెస్టులను పెంచాలని కోరుతున్నా. 70% ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలన్నది మన టార్గెట్. శాంపిల్ కలెక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వైరస్ ను గుర్తించి, పోరాడేందుకు ఇదొక్కటే మార్గం” అని తెలిపారు.ఇప్పుడు అసింప్టమాటిక్ కేసులు మరింత ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. ప్రజలు తమకు ఏదో చిన్న లంగ్ సమస్య ఉందని అనుకుంటారని, కానీ తమకు తెలియకుండానే ఫ్యామిలీ అంతటికీ వైరస్ ను అంటిస్తారన్నారు. ప్రజలకు వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాక్సినేషన్ కన్నా టెస్ట్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 
టెస్టింగ్, ట్రేసింగ్‌తోనే అడ్డుకట్ట  
‘‘దేశానికి మళ్లీ సవాల్ వచ్చింది. కరోనాను కట్టడి చేసేందుకు మీరంతా సూచనలు ఇవ్వాలని కోరుతున్నా. మన దగ్గర వ్యాక్సిన్ లతో సహా అన్ని వనరులూ ఉన్నాయి. కరోనాపై పోరులో అనుభవం కూడా వచ్చింది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్, తగిన జాగ్రత్తలు పాటించడం, కొవిడ్ మేనేజ్ మెంట్ వల్ల మాత్రమే కరోనా వ్యాప్తిని తగ్గించొచ్చు” అని ముఖ్యమంత్రులకు ప్రధాని చెప్పారు. సెకండ్ వేవ్ లో పెరుగుతున్న కేసులకు అడ్డుకట్ట వేయాలన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాలు ఫస్ట్ వేవ్ పీక్ స్టేజీని దాటేశాయని, ఇది చాలా ఆందోళనకర విషయమన్నారు. కరోనా పట్ల ప్రజలకు సీరియస్ నెస్ తగ్గిందని, చాలా రాష్ట్రాల్లో అధికారులు కూడా రిలాక్స్ అయ్యారని మోడీ చెప్పారు. 

రాజకీయాలు చేయొద్దు.. 
‘‘కరోనా విపత్తుపై రాజకీయాలు చేస్తున్నారంటూ రూలింగ్ బీజేపీ, అపొజిషన్ పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయాలు చేయాలనుకునే వాళ్లు ఆల్రెడీ చేస్తున్నారు. ఇలాంటి కష్ట కాలంలో ప్రజలకు సేవ చేయడం గురించే నేను ఆలోచిస్తున్నాను” అని పీఎం చెప్పారు. అన్ని పార్టీలు, ప్రజలు ఒక్కటిగా కలిస్తే వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తిగా మారుతుందన్నారు. 

డీలా పడొద్దు
మైక్రో కంటైన్మెంట్ జోన్లను సృష్టిం చడం, బాగా టెస్టులు చేయడమే కరోనాపై పోరాటంలో కీలకమని ప్రధాని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపొద్దన్నారు. చాలా రాష్ట్రాల్లో కేసులు పెరుగుతు న్నా అధికారులు రిలాక్స్ అయినట్లు కనిపిస్తోందని, దీంతో కేసులు పెరిగి సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా పాజిటివ్ రేట్ ను 5% కంటే తక్కువకు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, బీహార్ సీఎం నితీశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో బిజీగా ఉన్నందున బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కాలేదు.  

మోడీ ఫార్ములా

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పక్కాగా ఉండాలి. ఒక్కరికి పాజిటివ్ వచ్చినా 30 మందిని ట్రేస్ చేయాలి

కేసులు ఎక్కువైనా టెస్టులు మాత్రం పెంచాలె. 70 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయాలి

లాక్ డౌన్ అక్కర్లేదు. మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలి

నైట్ కర్ఫ్యూను ‘కరోనా కర్ఫ్యూ’ అని పిలుద్దాం. రాత్రి 9కి ప్రారంభించి పొద్దున 6కి ముగించాలి.

45 ఏళ్లు దాటినోళ్లంతా వ్యాక్సిన్ వేసుకోవాలి.