మోదీ కీ గ్యారంటీ ఫెయిల్ : ఖర్గే

మోదీ కీ గ్యారంటీ ఫెయిల్ : ఖర్గే
  •      హామీల అమలులో బీజేపీ విఫలం 
  •     ‘ఘర్ ఘర్ గ్యారంటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ 

న్యూఢిల్లీ : ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘‘ప్రధాని మోదీ తరచూ ‘మోదీ కీ గ్యారంటీ’ అని మాట్లాడుతున్నారు. కానీ అది ఫెయిల్ అయింది. ఆయన ఇచ్చిన హామీలేవీ ప్రజలను చేరలేదు. ఏటా 2 కోట్ల జాబ్స్ ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవి ఇప్పటి వరకు ప్రజలకు అందలేదు. అలాగే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ వాటిని కూడా నెరవేర్చలేదు” అని అన్నారు. 

మోదీ అబద్ధాలు చెబుతూ మోసగిస్తున్నా ప్రజలు ఎందుకు ఓటు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘‘మేం ఏదైనా హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాం. గతంలో ఎన్నో హామీలిచ్చి నెరవేర్చినం. హామీ ఇవ్వకున్నా ఉపాధి హామీ పథకం, ఆర్టీఐ, రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్ లాంటివి అమలు చేసినం” అని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ‘ఘర్ ఘర్ గ్యారంటీ’ ప్రచార కార్యక్రమాన్ని ఖర్గే ప్రారంభించారు. గ్యారంటీ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. 

‘‘మా పార్టీ ప్రకటించిన ‘5 న్యాయాలు.. 25 గ్యారంటీలు’ దేశంలోని ప్రజలందరికీ తెలియజేసేందుకే ఈ కార్యక్రమం ప్రారంభించాం. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలను కలిసి గ్యారంటీ కార్డులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ గ్యారంటీ కార్డులను పంచిపెట్టాలి” అని సూచించారు. కాంగ్రెస్​కు ఐటీ నోటీసులపై స్పందిస్తూ.. ‘‘ఐటీ దాడులతో ప్రతిపక్ష పార్టీలను భయపెట్టాలని బీజేపీ చూస్తున్నది. మా పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. మా పార్టీ నిధుల్లో నుంచి రూ.135 కోట్లు ఐటీ డిపార్ట్ మెంట్ తీసుకున్నది. ఇట్లయితే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతయా?” అని ప్రశ్నించారు.

14 భాషల్లో గ్యారంటీ కార్డులు.. 

గ్యారంటీ కార్డులను 14 భాషల్లో ప్రింట్ చేశామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ తెలిపారు. ‘‘ఈ కార్డులను కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ పంపిణీ చేస్తారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుటుంబాలకు అందజేస్తారు” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు.