
- మాయావతి ‘దళిత’ ఇమేజీని దెబ్బతీయడం
- కాంగ్రెస్ తీరును ఎండగట్టడం
- మేధావులు, రచయితలను ఇరుకున పెట్టడం
- 59లో 12 ఎస్సీ, 5 ఎస్టీ స్థానాలు
లోక్‌సభ ఎన్నికల తొలి ఆరు దశల్లో ప్రతిపక్షాల చరిత్రను తిరగదోడుతూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పుడో కొత్త ఆయుధం దొరికనట్లైంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో ఎన్నికలు ఎప్పుడో ముగిసినా, అక్కడి అల్వార్ గ్యాంగ్ రేప్ ఘటన చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. మోడీ ఏడో దశ ప్రచారం మొత్తం ‘అల్వార్’ చుట్టూ తిరుగుతున్నది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ సర్కారుకు బీఎస్పీ మద్దతు ఇస్తుండటంతో రెండు పార్టీలనూ మోడీ టార్గెట్ చేశారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లోని దళిత ఓట్లను రాబట్టుకోవాలన్నదే ఆయన స్ట్రాటజీ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అల్వార్ గ్యాంగ్‌రేప్ పై వరుస ప్రకటనలు
అల్వార్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ గ్యాంగ్‌రేప్ ఉదంతాన్ని ప్రధాని మోడీ ఇటీవల తరచుగా ప్రస్తావిస్తూ బీఎస్పీ చీఫ్ మాయావతిని, రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆదివారం యూపీలో జరిగిన ఎన్నికల ప్రచారంతోపాటు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని గుర్తు చేస్తూ మాయావతిపై విమర్శలు గుప్పించారు. చిత్తశుద్ధి ఉంటే రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలంటూ మాయావతికి సవాల్ విసిరారు. ఏప్రిల్ 26న రాజస్తాన్‌లో జరిగిన ఈ దారుణాన్ని ఇప్పుడు బలంగా తెరపైకి తేవడం, ఆ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినా ప్రస్తావిస్తుండటం వెనుక మోడీ మూడు లక్ష్యాలపై కన్నేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకటి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడం. రెండు.. దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా ఉన్న మేధావులు, సినీ ప్రముఖులు, అవార్డులు వెనక్కి ఇచ్చిన రచయితలను ఇరుకునపెట్టడం. మూడు.. దళిత వర్గాల ప్రతినిధిగా మాయావతికి ఉన్న ఇమేజీని దెబ్బతీయడం. దళిత మహిళపై భర్త ముందే ఐదుగురు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినా రాజస్తాన్ సర్కారుకు మాయావతి మద్దతిస్తూ పైకి మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఇదేనా ఆమె చిత్తశుద్ధి అంటూ ఆదివారం యూపీలోని కుషీనగర్, డియోరియాలో జరిగిన ప్రచారసభల్లో మోడీ ప్రశ్నించారు. రాజస్తాన్‌లో ఓ దళిత మహిళ రేప్‌కు గురైంది. దీనిపై మీకు(మాయావతికి) ఎలాంటి బాధ కలగకపోవడానికి కారణమేంటని ఆయన నిలదీశారు. దీనిద్వారా ఈ నెల 19న జరగనున్న తుది విడత పోలింగ్‌లో మాయావతి ఇమేజీని దెబ్బతీసి, దళితుల ఓట్లను బీజేపీ వైపు తిప్పుకునే యత్నం మోడీ చేస్తున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఆదివారం జరిగిన ఆరో విడతలో యూపీలోని 14 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అలాగే 19న మరో 13 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఇవి బీఎస్పీకి పట్టున్న, దళితుల ప్రాబల్యం ఉన్న సీట్లు కావడం గమనార్హం.
2014 నుంచే దళిత ఓటుపై కన్ను
వాస్తవానికి 2014 నుంచే దేశవ్యాప్తంగా దళిత ఓటు బ్యాంకుపై బీజేపీ కన్నేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే అంబేడ్కర్ జపం చేస్తోందని, పార్లమెంట్‌లో రాజ్యాంగ దినోత్సవం జరిపిందని, దేశ, విదేశాల్లో రాజ్యాంగ నిర్మాత పేరుతో బిల్డింగ్‌లు, స్మారక చిహ్నాలు కట్టిస్తోందని గుర్తుచేస్తున్నారు. కేంద్రం ప్రతిష్ట్మాకంగా భావిస్తున్న స్వచ్ఛ భారత్ స్కీంను ఢిల్లీలోని వాల్మికీ బస్తీ నుంచి ప్రారంభించడం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌పై సుప్రీంకోర్టు రూలింగ్‌ను సైతం పక్కన పెట్టి చట్టం తేవడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో కార్మికుల కాళ్లు కడగడం కూడా దళితులకు దగ్గరయ్యే ప్రయత్నమేనని అంటున్నారు.
బీజేపీ వైపు నాన్ జాతవ్ దళితులు!
యూపీలో నాన్ జాతవ్ దళితులు బీఎస్పీ నుంచి తమ వైపు మొగ్గుతున్నట్టు బీజేపీ నమ్ముతోంది. వీరిని అలాగే కాపాడుకుంటూ మిగతా దళిత కులాలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కుల సమీకరణలతో తుది విడతలో జరిగే 13 సీట్లలో మెజారిటీ స్థానాలను గెల్చుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. 19న జరగునున్న పోలింగ్‌లో యూపీలోని ఈ 13 సీట్లతోపాటు బీహార్‌లోని 8, జార్ఖండ్‌లోని 3, మధ్యప్రదేశ్‌లోని 8, పంజాబ్‌లోని 13, పశ్చిమబెంగాల్‌లోని 9, హిమాచల్‌లోని 4 స్థానాలకు ఎన్నికలు
జరగనున్నాయి.
ఏడో ఫేజ్‌లోని రిజర్వుడు స్థానాలివే..
లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో భాగంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 59 స్థానాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ జరుగనుంది. వీటిలో 12 ఎస్సీ రిజర్వుడు సీట్లు, 5 ఎస్టీ రిజర్వుడు సీట్లున్నాయి.జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. కాబట్టే బీజేపీ, ప్రధాని మోడీ దళితుల అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. 2014లో ఈ 59 సీట్లకుగానూ ఎన్డీఏ 40 చోట్ల విజయం సాధించింది. బీజేపీ సొంతగా33 సీట్లలో సత్తా చాటుకోగా, ఎన్డీఏ మిత్రపక్షాలు 7 చోట్ల గెలిచారు. ఈసారి అన్ని చోట్లా బీజేపీకి ప్రత్యర్థు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఎస్సీ రిజర్వుడు స్థానాలు
జలంధర్ (పంజాబ్)
హోషియార్పూర్(పంజాబ్)
ఫతేపూర్సాహిబ్(పంజాబ్)
ఫరీద్కోట్(పంజాబ్)
ఉజ్జయిని(మధ్యప్రదేశ్)
దేవాస్(మధ్యప్రదేశ్)
సాసారామ్(బీహార్)
బన్స్‌గావ్(ఉత్తరప్రదేశ్)
రాబర్ట్స్‌గంజ్(ఉత్తరప్రదేశ్)
జయ్నగర్(వెస్ట్‌బెంగాల్)
మథురాపూర్(వెస్ట్‌బెంగాల్)
సిమ్లా(హిమాచల్ ప్రదేశ్)
ఎస్టీ రిజర్వుడు సీట్లు
రాజ్‌మహల్(జార్ఖండ్)
దుమ్కా (జార్ఖండ్)
రత్లామ్(మధ్యప్రదేశ్)
ధార్(మధ్యప్రదేశ్)
ఖర్గోన్(మధ్యప్రదేశ్)