రామానుజుడు, అంబేద్కర్​ చెప్పింది ఒక్కటే

రామానుజుడు, అంబేద్కర్​ చెప్పింది ఒక్కటే
  • వెయ్యేండ్ల కిందట్నే రామానుజాచార్యులు సమానత్వాన్ని చాటారు: ప్రధాని 
  • సమాజంలో అంధ విశ్వాసాలు చెలరేగినప్పుడు మహానుభావులు పుడుతారు
  • ‘సబ్​కా సాథ్​​.. సబ్​కా వికాస్​​’తో ముందుకెళ్తున్నాం
  • తెలంగాణ సంస్కృతి గొప్పది అంటూ ప్రశంస
  • ముచ్చింతల్​లో ‘స్టాచ్యూ ఆఫ్​ ఈక్వాలిటీ’ ఆవిష్కరణ

హైదరాబాద్​, వెలుగు: రామానుజాచార్యులు కేవలం ఆధ్యాత్మిక సందేశం మాత్రమే ఇవ్వలేదని, జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా ఎలా పరిష్కరించుకోవాలో చెప్పారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అంతా ఒక్కటేనని చాటి చెప్పిన మహానుభావుడని కొనియాడారు. జగద్గురు రామానుజ బోధనలు స్ఫూర్తి దాయకమని అన్నారు. ‘‘సమాజంలో అంధవిశ్వాసాలు, చెడు భావనలు బయలు దేరినప్పుడు వాటితో పోరాడే మహోన్నత వ్యక్తులు పుడుతారు. అలాంటి మహానుభావుల్లో జగద్గురు రామానుజాచార్యులు ఒకరు. భారత సంస్కృతిలో ఉన్న ఒక మహోన్నత లక్షణమిది” అని పేర్కొన్నారు. వెయ్యేండ్ల కిందట్నే సమానత్వాన్ని చాటిచెప్పిన సమతామూర్తి రామానుజాచార్యులు అని అన్నారు.  రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​లో ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రధాని మోడీ శనివారం జాతికి అంకితం చేశారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్​లో పటాన్​చెరులోని ఇక్రిశాట్​కు వెళ్లారు. అక్కడ గోల్డెన్​ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముచ్చింతల్​కు వచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు విష్వక్సేనేష్టి యాగంలో పాల్గొన్నారు. అక్కడ 108 దివ్య ఆలయాలు దర్శించుకొని..  216 అడుగుల పంచ లోహ ‘సమతామూర్తి’ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వసంత పంచమి శుభ దినాన రామానుజుల విగ్రహావిష్కరణ చేసే అదృష్టం తనకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ధ్యాన మూలం.. గురుమూర్తి ధ్యానానికి, చింతనకు మూలం గురువు రూపమని, గురువు ద్వారానే మనకు జ్ఞానం లభిస్తుందని ప్రధాని అన్నారు. 

‘‘ధ్యాన మూలం.. గురుమూర్తి. జీవితంలో సూక్ష్మమైన విషయాలు కూడా గురువు ద్వారానే బోధపడతాయి. ఇక్కడ నెలకొల్పిన రామానుజాచార్యుల విశాల రూపం కూడా అందరికీ ప్రేరణ కలిగిస్తుంది. మన దేశ సంస్కృతికి ప్రతీక అయిన జ్ఞానం, ధ్యానం, చింతన, వైరాగ్యం, ఆదర్శాలకు స్టాచ్యూ ఆఫ్​ ఇక్వాలిటీ చిహ్నం. అందుకే ఈ ప్రతిమ రానున్న తరాలకే కాదు దేశ ప్రాచీన వైభావాన్ని విశ్వవ్యాప్తం చేస్తుంది” అని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 108 దివ్య ఆలయాలను ఒకే దగ్గర దర్శించే భాగ్యం ఇక్కడ తనకు కలిగిందన్నారు. 12 రోజుల పాటు జీయర్​ స్వామి చొరవ వల్ల రకరకాల పూజలు జరుగుతున్నాయని, అందులో విశిష్టమైన విశ్వక్సేనేష్టి యాగంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. ఈ యాగం సంకల్పానికి చిహ్నమని,  దేశంలోని 130 కోట్ల మంది ప్రజల కోసం తాము సంకల్పించిన పనులు నెరవేరాలని కోరుకుంటున్నానని అన్నారు. రామానుజ బోధనలు వింటే మంచికి దగ్గరగా, చెడుకు దూరంగా ఉండాలని తెలుస్తుందని తెలిపారు. ‘‘సమాజాన్ని బాగు చేసేందుకు రామానుజాచార్యులు సరైన మార్గం చూపారు. మనుషుల నడుమ భేదభావాలు లేవని బోధించారు. ఇందుకు తగ్గట్టుగానే విలువలతో జీవించారు. దళితులు, ఇతర అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్నారు. వాళ్ల కోసం గుడులు కట్టించి, ఆలయ ప్రవేశం చేయించారు. అన్ని వర్గాలకు చెందిన శిష్య వర్గం ఆయనతో ఉండేవారు. జాతి కాదు.. గుణం ముఖ్యమని చాటిచెప్పారు” అని వివరించారు. 

జీయో.. ఔర్​ జీనేదో..!
జటాయువు అంతిమ సంస్కారాలను రాముడు చేయడం ద్వారా వేరే జాతిని ఆదరించినట్లుగానే రామానుజుడు ఇతర కులాల వారి అంతిమ సంస్కారాల్లో పాల్గొని మానవులంతా ఒక్కటేననే సందేశాన్ని వెయ్యేండ్ల కిందట్నే చాటిచెప్పారని మోడీ పేర్కొన్నారు. ‘‘రామానుజాచార్యులు దక్షిణ భారత్​లో పుట్టినా ఆయన ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. తెలుగువారైన అన్నమాచార్యులు ఆయనను కీర్తించారు. గుజరాత్​, రాజస్థాన్​లోని సంతులు కూడా ఆయన బోధనలు స్మరించుకుంటారు. ఉత్తర భారతంలో తులసీదాస్​, కబీర్​దాస్​ ఆయన బోధనలకు ప్రభావితులై కీర్తనలు వినిపించారు. దేశంలో ఎందరో ఇలాంటి ఆధ్యాత్మిక గురువులు ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. అదే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది. గాంధీ మహాత్ముడు లేని స్వాతంత్ర్యాన్ని ఊహించలేం..ఆయన అహింసా మార్గానికి కూడా కారణం రామానుజ బోధనలే. గాంధీజీ నిత్యం వినే ‘వైష్ణవ జనతో’ గేయాన్ని కూడా రామానుజుని అనుయాయి రాసిందే. నాటి పోరాట యోధులను తలచుకుంటూ దేశంలో ఆజాదీ కా అమృత్​ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్య పోరాట స్మరణ కేవలం బల నిరూపణకు సంబంధించింది కాదు... అందులో జియో.. ఔర్​ జీనేదో అనే నినాదం ఇమిడి ఉంది” అని పేర్కొన్నారు. గవర్నర్​ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి,  త్రిదండి చినజీయర్​ స్వామి, మైహోం రామేశ్వర్​రావు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం లేజర్​ షోను ప్రధాని మోడీ వీక్షించారు. 

తెలంగాణ సంస్కృతి గొప్పది
హైదరాబాద్​తో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్​వల్లభ్‌భాయ్​  పటేల్​కు విశిష్టమైన అనుబంధం ఉందని, అలాంటి నాయకుడి విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్​ యూనిటీ’ని తాను అహ్మదాబాద్​లో ఆవిష్కరించాని మోడీ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ రామానుజాచార్య విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్​ ఈక్వాలిటీ’ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణకు వచ్చిన తనకు తెలుగు ప్రజల సంస్కృతి ఎంత గొప్పదో, దేశాన్ని అది ఎలా ప్రభావితం చేసిందో  తెలుసని పేర్కొన్నారు. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్య రాజులు వంటి ఎందరో తెలుగు సంస్కృతి పతాకాన్ని ఎగురవేశారని, మహాకవులు తెలుగు సంస్కృతిని పరిపుష్టం చేశారని ఆయన కొనియాడారు. అనేక మంది తెలుగు నేతలు దేశాన్ని ముందుకు నడిపారన్నారు. ‘‘తెలంగాణ సంస్కృతి గొప్పది. ఇక్కడి రామప్ప ఆలయం ప్రపంచ ఖ్యాతిని గడించింది. ఈ ఆలయానికి ఇప్పటికే యునెస్కో గుర్తింపు లభించింది. పోచంపల్లి గ్రామం వరల్డ్​ టూరిజం విలేజ్​ అవార్డును సొంతం చేసుకుంది. పోచంపల్లి మహిళలు నేసిన చీరలు విశ్వవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించాయి. మహిళా శక్తి అంటే ఏమిటో ఈ నేల చాటింది” అని ప్రధాని పేర్కొన్నారు. తెలుగు సినీ రంగం కూడా విశ్వఖ్యాతి పొందిందని, సిల్వర్​ స్క్రీన్​పైనే కాకుండా ఓటీటీలోనూ తెలుగు ఫిల్మ్​ ఇండస్ట్రీ దూసుకుపోతున్నదని అన్నారు. కళా రంగంపై తెలుగు ప్రజలకు ఉన్న ప్రేమ అందరికీ ప్రేరణనిస్తున్నదని మోడీ కొనియాడారు.

పట్టువస్త్రాలు.. త్రినామాలతో..  
ఇక్రిశాట్ సందర్శన సందర్భంగా మోడీ కాషాయ రంగు దుస్తుల్లో కనిపించారు. రామానుజన్ విగ్రహం సందర్శనకు మాత్రం ప్రత్యేకంగా పసుపు రంగు పట్టు వస్త్రాలు ధరించారు. నుదుటిన త్రినామాలు పెట్టుకున్నారు. కార్యక్రమంలో మోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మోడీ చేత చిన జీయర్ స్వామి గండపెండేరం కూడా ధరింపజేశారు.

సమానత్వానికి ఆధునిక నాయకుడు అంబేద్కర్
అంబేద్కర్​ కూడా రామానుజాచార్యుల బోధనలను ప్రస్తావించేవారని, సమానత్వానికి ఆధునిక నాయకుడు అంబేద్కర్​ అని  ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జగద్గురు నింపిన సమతా స్ఫూర్తి రాజ్యాంగంలో కూడా ఉందన్నారు. ద్వైతం, అద్వైతాలను మేళవించి విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు ఆదర్శ ప్రాయులని చెప్పారు. ఈ దేశ ప్రజలను ఒక్క తాటిపై కలిపి ఉంచేందుకు  ఆయన చేసిన బోధనలు దూరదృష్టికి చిహ్నమని,  ఆయన ఇచ్చిన సందేశంతోనే ఈ రోజు దేశంలో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్​’ అనే  మంత్రంతో నవ భారత్​కు పునాది వేస్తున్నామని మోడీ పేర్కొన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందాలని తాము వివిధ రకాల పథకాలు ప్రవేశపెట్టామని.. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఉజ్వల గ్యాస్​ కనెక్షన్​, ఉచిత కరెంట్​, జన్​ధన్​ ఖాతాలు వంటివి ఎన్నో చేపట్టి అందరినీ స్వశక్తులను చేసేందుకు పాటుపడుతున్నామని వివరించారు.

ముచ్చింతల్​లో మూడు గంటలు
సమతా విగ్రహం ప్రారంభ వేడుకలకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ ముందుగా పటాన్ చెరులోని ఇక్రిశాట్​ను సందర్శించారు. అక్కడి నుంచి హెలికాప్టర్​లో ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి చినజీయర్ స్వామి, మైహోం రామేశ్వర్ రావు స్వాగతం పలికారు. అన్ని రంగాల్లో విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ విశ్వక్సేన పూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత రామానుజాచార్య విగ్రహం వద్దకు వెళ్లారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, నేషనల్ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మల్లారెడ్డి ప్రధానికి స్వాగతం పలికారు. తర్వాత 108 దివ్య దేశాల(ఆలయాలు)లో కొన్నింటిని దర్శించుకున్నారు. ఆడిటోరియం విశేషాలు, స్టాచ్యూ ఘనతను అడిగి తెలుసుకున్నారు. పావుగంట మళ్లీ యాగశాలకు వెళ్లి మరోసారి పూజలు చేశారు. ఈ సందర్భంగా మోడీని నెమలీకల దండతో సన్మానించారు.