అన్నిదేశాలకూ టెర్రరిజంతో డేంజర్ : మోడీ

అన్నిదేశాలకూ టెర్రరిజంతో డేంజర్ : మోడీ

మాలే(మాల్దీవులు): టెర్రరిజాన్ని పెంచి పోషించే దేశాలతో మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. పరోక్షంగా పాకిస్థాన్​ను ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టుల్లో మంచి, చెడు అంటూ ఉండరని అన్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి కలిసి రావాలంటూ ప్రపంచ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. భూతాపం, వాతావరణ మార్పులపై స్పందించిన తరహాలోనే టెర్రరిజంపై పోరులోనూ కలిసి రావాలని, గ్లోబల్​కాన్ఫరెన్స్​ ఏర్పాటుచేసి, పరిష్కార మార్గాలపై చర్చించాలని మోడీ కోరారు. శనివారం మాల్దీవుల పార్లమెంట్​లో ఆయన ప్రసంగించారు. ఇండియా, మాల్దీవుల మధ్య చాలా కాలంగా స్నేహ బంధం ఉందన్నారు. మాల్దీవులలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన సాయం అందించేందుకు ఇండియా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ‘ఈ రోజు మీ మద్య ఉండడం, రెండు దేశాల మధ్య ఫెర్రీ సర్వీసు నడపాలని ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది. మీ ప్రేమ, అభిమానం ప్రతి భారతీయుడి గుండెలను తాకింది’ అని అన్నారు. ఎన్డీయే సర్కారు ‘సబ్​కా సాత్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్’ లక్ష్యంగా పనిచేస్తుందని మోడీ చెప్పారు. పాలనలో, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాల విషయంలోనూ ఇదే రూల్​ను ఫాలో అవుతామన్నారు. మాల్దీవులతో ఇండియా బలమైన స్నేహ సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. సముద్ర ప్రయాణం, సరుకు రవాణా అంశాల్లో పరస్పర సాయంతో ముందుకెళ్లాలని మాల్దీవులు ప్రెసిడెంట్​తో ఆరు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ మాల్దీవులు పర్యటనకు వెళ్లారు. మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్​షాహిద్ మాలెలో​ మోడీకి స్వాగతం పలికారు. తర్వాత మాల్దీవుల ప్రెసిడెంట్‌ ఇబ్రహీం సోలీహ్ తో మోడీ భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి తీర ప్రాంత నిఘా రాడార్‌‌ సిస్టమ్‌, కాంపోజిట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌‌ ఫర్‌‌ మాల్దీవ్స్‌ను ప్రారంభించారు. డిఫెన్స్‌, మారిటైమ్‌, అంశాలకు సంబంధించి రెండు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు జరిగాయని అబ్దుల్‌ షాహిద్‌ చెప్పారు. మాల్దీవుల్లో ఇండియా చేపట్టిన ప్రాజెక్టులతో ప్రజల జీవితాలు మెరుగుపడతాయని మోడీ అన్నారు. మాల్దీవుల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. ‘నైబర్‌‌హుడ్‌ ఫస్ట్‌’ పాలసీ విధానంలో భాగంగా పొరుగుదేశమైన మాల్దీవుల పర్యటనకు వెళ్తున్నట్లు మోడీ చెప్పిన విషయం తెలిసిందే.

మోడీకి అత్యున్నత పురస్కారం

నరేంద్ర మోడీకి మాల్దీవుల అత్యున్నత పురస్కారం లభించింది. ప్రభుత్వం ఆయనను ‘రూల్​ఆఫ్ నిషాన్​ఐజుద్దీన్’ పురస్కారంతో సత్కరించింది. మాలేలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రెసిడెంట్​సోలీహ్ ఈ అవార్డును మోడీకి అందజేశారు. కాగామాల్దీవుల ప్రెసిడెంట్‌ సోలిహ్ కు​ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ సంతకాలు చేసిన బ్యాట్‌ను మోడీ గిఫ్ట్‌గా ఇచ్చారు.