రష్యా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్లతో మాట్లాడనున్న మోడీ

రష్యా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్లతో మాట్లాడనున్న మోడీ

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్స్కీతో నేడు ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ప్రకటన వచ్చింది. రష్యా- ఉక్రెయిన్ మధ్య 12వరోజు కూడా యుద్ధం భీకరంగా సాగుతోంది.  ఈ నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు తీవ్ర విమర్శలకు దిగాయి. యుద్ధం విరమించుకోవాలని కొన్ని దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే మొదటి నుంచి కూడా భారత్ తటస్థ వైఖరితో ఉంది.

అయితే .. యుద్ధాన్ని ఆపించేలా చర్యలు తీసుకోవాలని జెలెన్స్కీ ప్రధాని మోడీని కోరారు. ఆ దేశ విదేశాంగ మంత్రి కుబెలా కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడి యుద్ధం విరమింపజేయాలని మోడీని కోరారు. మరోవైపు భారత్ లో ఉన్న ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోరో పొలికా  ప్రధాని మోదీని అభ్యర్థించారు. అమెరికా వంటి దేశాలు కూడా రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ స్పందించాలని ఒత్తిడి తీసుకొచ్చాయి.

మరో వైపు... ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులతో విరుకుపడుతున్న క్రమంలో అక్కడ ఉన్న భారతీయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడి వారిని క్షేమంగా భారత్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా మోడీ మాట్లాడారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయల తరలింపుకు సహకారం అందించాలని ఈ సందర్భంగా పుతిన్ ను మోడీ అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికే దాదాపు 16 వేల మందికి పైగా భారత్ కు తీసుకొచ్చినట్లు విదేశాంగ తెలిపింది. అయితే ఇంకా చాలా మంది భారతీయులు ఉక్రెయిన్ లోనే ఉండిపోయారని, వారిని కూడా ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారత్ తెలిపింది.

ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ ప్రెసిడెంట్లతో మోడీ ఫోన్ లో మాట్లాడబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా.. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో చివరిసారిగా గత నెల 26న మోడీ జెలెన్స్కీతో మాట్లాడారు. 

మరిన్ని వార్తల కోసం:

ఇండియా కోసమైనా యుద్ధాన్ని ఆపించండి