భావి భారతం కోసమే మోడీ నిర్ణయాలు

భావి భారతం కోసమే మోడీ నిర్ణయాలు

ప్రస్తుతం మనదేశం అసాధారణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి ప్రతి ప్రాంతాన్ని, ప్రతి అంశాన్ని ప్రభావితం చేసిన పరిస్థితి ఇంతకు ముందు ఏ ప్రధానికీ ఎదురవలేదు. మన కుటుంబంలో ఒక్కరు అనారోగ్యంతో ఉన్నా మనం కుమిలిపోతాం. అలాంటిది దేశంలో 130 కోట్ల మందికి కరోనా రూపంలో ప్రమాదం ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీ తన బాధ్యతను నెరవేర్చడానికి, కరోనాను తుద ముట్టించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా భావి భారతాన్ని దృష్టిలో ఉంచుకునే చేస్తారు.

కరోనాను కంట్రోల్​ చేయడం, ఆక్సిజన్ సరఫరా, టీకా అందించడంపై మోడీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలతోపాటు కొందరు పనిగట్టుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు, ఒత్తిడి ఉన్నా ఏమాత్రం జంకక, కర్తవ్యం మీద నుంచి దృష్టి మరల్చకుండా శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి పని చేసుకొంటూ వెళ్తున్నారు. ప్రధాని మోడీకి ఉన్న దేశభక్తి, శ్రద్ధ అపారమైనవి. చరిత్రలో అటువంటి దీక్షాదక్షతలున్న వ్యక్తులను అరుదుగా చూస్తాం. దేశం ఎదుర్కొంటున్న అన్ని ప్రధాన సమస్యలకూ మూల కారణాలను గుర్తించి సాహసోపేతమైన నిర్ణయాలతో ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మోడీ కరోనాతో పోరాడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం మోడీతో పోరాడుతున్నాయి. రాహుల్ గాంధీ లాంటి అపరిపక్వ నేత రోజూ మోడీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తే పనైపోతుందని అనుకుంటున్నారు. 

రాష్ట్రాలను ముందే హెచ్చరించిన కేంద్రం
దేశం ఎదుర్కొన్న అన్ని సమస్యల్లో కరోనా అత్యంత కష్టతరమైంది. తనకున్న సంకల్ప బలంతో కరోనాను అదుపు చేయడానికి మోడీజీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా సెకండ్​ వేవ్​ గురించి సైంటిస్టులు హెచ్చరించినా కేంద్రం ఏమీ చేయలేదనేది అవాస్తవం. మార్చి 17న కేంద్రం అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లతో సమావేశం ఏర్పాటు చేసింది. స్వయంగా ప్రధాని కరోనా సెకండ్ వేవ్ మొదలైందని, ఓవర్ కాన్ఫిడెన్స్, నిర్లక్ష్యం వద్దని అప్రమత్తం చేశారు. మమత లాంటి వాళ్లు ఆ సమావేశానికి రాలేదు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతి రాష్ట్రానికి 15 సార్లు రిమైండర్స్ పంపింది. ప్రధాని మోడీ ప్రతి సీఎంతోనూ ఆన్​లైన్​ సమావేశంలోనే కాక వ్యక్తిగతంగా మాట్లాడారు. అప్పటికి రోజువారీ కేసులు 30 వేలు మాత్రమే. 2021 ప్రారంభం నుంచి రాష్ట్రాలను కేంద్రం హెచ్చరిస్తూనే ఉంది.

ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా సురక్షితమైనది
అమెరికా, యూరోప్ జనాభా కంటే మన దేశ జనాభా ఎక్కువ. కరోనా ప్రభావిత దేశాలను జనాభా ప్రాతిపదికన కాకుండా దేశాల సంఖ్యాపరంగా చూసినా, ప్రతి పది లక్షల జనాభాకు నమోదైన కేసులు, మరణాలను చూసుకుంటే ప్రపంచంలో ఇండియా 110వ స్థానంలో ఉందన్నది నిజం. ఒప్పందం మేరకు ముడి పదార్థాలు ఇచ్చిన దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతులు జరగ్గా, వాక్సిన్లు కొనుగోలు చేయలేని మిత్రదేశాల పేద ప్రజలకు ఉదారంగా మన ప్రభుత్వం వ్యాక్సిన్లను అందించింది. సొంత ప్రజలకు అందించిన వాక్సిన్లతో పోల్చితే అందులో 1/3 వంతు మాత్రమే పంపిణీ చేసింది. సొంత ప్రజలను కాదని విదేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి చేశారనడంలో వాస్తవం లేదు.

కరోనా అదుపులో టీఆర్ఎస్ సర్కార్​ ఫెయిల్
ఇక తెలంగాణలో కరోనా వ్యాప్తికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం టెస్టులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపించడం వల్లే ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయి భయానక పరిస్థితులకు దారి తీసింది. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై చూసిచూడనట్లుగా వ్యవహరించడంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కరోనా రోగులకు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకకపోవడం, మందుల కొరత, ఆక్సిజన్ లేకపోవడానికి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలే కారణం. వ్యాక్సిన్ వేసుకోవాలని ఇప్పటి వరకూ సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రజలకు పిలుపునివ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటి? కేసీఆర్ వ్యాక్సిన్ వేసుకోకపోవడం అంటే వ్యాక్సినేషన్ ను అవమానించటమే. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ.. తమ అసమర్థతను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన చానళ్లు, పత్రికల ద్వారా కేంద్రం ఏమీ చేయలేదంటూ దుష్ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు రాజకీయ స్వార్థం కోసం ఎత్తులు, వ్యూహాల్లో మునిగిపోయారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచనలు చేసినా, తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ సర్కారు తీరు మారకపోవటం బాధాకరం. కేంద్రం పంపిన వ్యాక్సిన్లను ఎక్కువగా వృథా చేసిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 7.18 లక్షల టీకాలు ఉన్నా వ్యాక్సినేషన్ ఎందుకు ఆపారు?

రైల్వే కరోనా కోచ్ లను వాడుకోలేని దుస్థితి
కరోనా మరణాల విషయంలో కేంద్రానికి రాష్ట్ర సర్కార్ సరైన నివేదికలు ఇవ్వడం లేదు. పైగా రాష్ట్రానికి ఆక్సిజన్, మందుల కోటా తక్కువగా వస్తోందని కేంద్రంపై నిందలుమోపుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆక్సిజన్, బెడ్లు, డాక్టర్ల కొరత ఏర్పడింది. తెలంగాణలో 200కు పైగా రైల్వే కరోనా కోచ్​లు ఖాళీగా ఉన్నాయి. ఏడాది క్రితమే వీటిని సిద్ధం చేసినా నేటికీ వాడుకలోకి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కరోనా కోచ్​లు ఇస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. పడకలు దొరక్క రోగులు ఇబ్బంది పడుతుంటే, సిద్ధంగా ఉన్న కరోనా కోచ్ లను వాడుకోకపోవడం ఎందుకు? అలాగే తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని ఎన్నో పోరాటాలు చేశాం. గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష తలపెట్టిన తర్వాత రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయుష్మాన్ ద్వారా రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. ఆయుష్మాన్ భారత్ అమలుతోపాటు కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చి రూ.5 లక్షల వరకు వైద్య పరిమితిని పెంచాలి.

జర్నలిస్టులను ఆదుకోవాలి
ప్రైవేట్ రంగమైన ప్రచార, సమాచార మాధ్యమాల్లో పని చేస్తున్న వారు అనేకమంది కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి తగిన వైద్య సదుపాయం అందించాలి. అనేకమంది ఆస్తులను కుదువ పెట్టినా వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నారు. ఎంతో మంది ఇప్పటికే మృత్యువాత పడడం బాధాకరం. వారి కుటుంబాలను ఆదుకోవాలి.

ప్రధానికి అండగా నిలుద్దాం..
మోడీ ప్రజల అంచనాలకు అనుగుణంగా, నిందలు, ఆరోపణలు లెక్క చేయకుండా, నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారు. మోడీ చేసే ప్రతి పనిలో రంధ్రాన్వేషణ చేయాలని ప్రతిపక్షాలు, సోకాల్డ్ కుహనా మీడియా సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దేశం అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలిచి ఈ ఉపద్రవాన్ని పరిష్కరించడంలో మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాం. కుటిల కాంగ్రెస్, సోకాల్డ్ కుహనా మీడియా సంస్థల ఉచ్చులో పడకుండా మహమ్మారితో పోరాడుతున్న మన దేశ ప్రజల వెంట, తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న కరోనా యోధులకు, దేశాన్ని కాపాడుతున్న మోడీకి అండగా నిలుద్దాం, నడుద్దాం.

రాష్ట్రాలకు ఫ్రీగా టీకాలు
ఇప్పటివరకు దేశం మొత్తంలో వినియోగించిన టీకాల్లో 50 శాతం వరకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందించింది. ఇందులో పేదలకు టీకాలు అందని పరిస్థితి ఎక్కడుంది? దేశంలో వ్యాక్సిన్ కొరత ఉందని విమర్శిస్తున్న వారికి ఇంత తక్కువ సమయంలో 18 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించిన దేశం ప్రపంచంలో ఇండియా మాత్రమేనని తెలియదా? ఇక, టీకా తయారీ అనేది పూర్తిగా ప్రైవేట్ కంపెనీల వ్యవహారం. ధర నిర్ణయం విషయంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రం. ధర నిర్ణయం, సేకరణలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. వ్యాక్సిన్ సరఫరా కోసం రాష్ట్రాలు కంపెనీలతో చర్చించి ధర నిర్ణయించుకోవచ్చు. కావలసినన్ని టీకాలు కొనుగోలు చేసే స్వేచ్ఛను రాష్ట్రాలకు కేంద్రం కల్పించింది. ఇందులో వివక్ష అన్న విషయమే లేదన్నది నిజం. టీకా సరఫరా చేసేందుకు సీరం ఇనిస్టిట్యూట్​కు రూ.3,000 కోట్లు, భారత్ బయోటెక్​కు రూ.1,500 కోట్లను అడ్వాన్స్ గా కేంద్రం విడుదల చేసింది. అంతేకాక ప్రధాని మోడీ జరిపిన చర్చల ద్వారా సీరం సంస్థ కోవీషీల్డ్ టీకా ధరను రూ.300కు, భారత్ బయోటెక్ కోవాగ్జిన్​ టీకా ధరను రూ.400కు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేయనున్నాయి.

అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చిన కేంద్రం
తెలంగాణకు మోడీ ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చింది. గతంలో రోజుకు 430 టన్నుల ఆక్సిజన్ సమకూరుస్తుండగా, ప్రస్తుతం అదనంగా 200 టన్నులు పెంచింది. పీఎం కేర్స్ నుంచి 5 ఆక్సిజన్ ప్లాంట్లు, మరో 12 ఆక్సిజన్ ప్లాంట్లు రాబోతున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణకు ఆర్మీ యుద్ధ విమానాల ద్వారా టన్నుల కొద్దీ ఆక్సిజన్ తరలిస్తూనే ఉంది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 890 ఆంపోటెరిసిన్-బి ఔషధం పంపిణీ, 1,405 వెంటిలేటర్స్, 1,000 డీ టైపు ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రానికి ఇచ్చింది. ఇప్పటి వరకు 9 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ద్వారా మెడికల్ ఆక్సిజన్ ను రవాణా చేసింది. అలాగే 62 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసులను కేంద్రం తెలంగాణకు పంపిణీ చేయగా 55.23 లక్షలకుపైగా వినియోగించారు. ఏప్రిల్ 21 నుంచి మే 16 వరకు 1,45,000 రెమిడిసీవిర్ వయల్స్ ను తెలంగాణకు పంపిణీ చేసింది.

ఆర్భాటం కోసమే గాంధీ, ఎంజీఎం విజిట్
రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్స్, సానిటేషన్, ఇతర సిబ్బందికి, పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి, జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్​ ఇచ్చి, వారు మరింత ఉత్సాహంగా పని చేసేలా చూడాలి. జూనియర్ డాక్టర్లకు 15% స్టైఫెండ్ పెంచాలనే డిమాండ్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది కష్టపడుతుంటే భరోసా ఇవ్వకపోవడం దుర్మార్గం. కేసీఆర్ గాంధీ, ఎంజీఎం దవాఖానాలకు వెళ్లి ఏం సాధించారు? ఎమ్మెల్యేలు, మంత్రులకే టైం ఇవ్వని కేసీఆర్ ఏడేండ్ల తర్వాత ప్రచార ఆర్భాటం కోసమే బయటకొచ్చారు. గాంధీ, ఎంజీఎంకు వెళ్లడం సంతోషమే కానీ, పేషెంట్ల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏడుసార్లు గాంధీలో పర్యటించి రోగుల సమస్యలు తెలుసుకున్నారు. సౌకర్యాల కల్పనకు కృషి చేశారు. కానీ, ఆస్పత్రుల్లో సమస్యలు కేసీఆర్ కు ఎందుకు కనిపించడం లేదు?

వైద్య విభాగంలో ఖాళీలు భర్తీ చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా వైద్య విభాగాల్లో భారీగా ఖాళీలున్నాయి. మూడు నెలల కోసం 50,000 వైద్య సిబ్బంది భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య తక్కువే. మూడు నెలల కోసం కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నియామకాలు చేపట్టాలి. వైద్య సిబ్బందితో పాటు ఇతర విభాగాల్లోనూ దాదాపు లక్ష మందిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే అది పేద ప్రజల పాలిట శాపంగా మారుతుంది. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన వివిధ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలి.

- బండి సంజయ్ కుమార్, కరీంనగర్​ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు