
ప్రధాన మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ విద్యార్థుల స్కాలర్ షిప్స్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అమరుల కుటుంబాల పిల్లలకు లబ్ది చేకూరనుంది. ఉగ్రదాడులు, నక్సల్స్ దాడిలో అమరులైన జవాన్ల పిల్లలకు భారత రక్షణ నిధి నుంచి ఇచ్చే స్కాలర్ షిప్ మొత్తాన్ని పెంచారు. వారికి నెలనెలా ఇచ్చే స్కాలర్ షిప్ అంశంపై మోడీ తొలి సంతకం చేశారు. బాలురకు నెలకు రూ.2వేల స్కాలర్ షిప్‌ను రూ.2,500లకు, బాలికలకు ఇచ్చే రూ.2,250ను రూ.3వేలకు పెంచారు. ఇప్పటి వరకు కేంద్ర, పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన్న ఈ స్కాలర్ షిప్‌లను రాష్ట్రాలకూ విస్తరించాలని నిర్ణయించారు. ఏడాదికి మొత్తం 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారికి అందించనున్నారు. వీటన్నింటికి నోడల్ మంత్రిత్వశాఖగా హోంశాఖ ఉండనుంది.
అంతేకాదు 60 ఏళ్లు దాటిన రైతులకు భృతి ఇచ్చేందుకు కేంద్రం శ్రీకారం చుట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.