న్యూఢిల్లీ: కెరీర్ వందో టెస్ట్ బెంగళూరులో ఆడాలనుకున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కల ఫలించేలా లేదు. ఈ నెల చివర్లో ఇండియాలో శ్రీలంక టూర్ షెడ్యూల్‌ను బీసీసీఐ మార్చింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మొదటగా రెండు టెస్టులు బెంగళూరు, మొహాలీలో జరగాలి. తర్వాత మూడు టీ20ల సిరీస్‌ను ప్లాన్ చేశారు. కానీ, లంక బోర్డు రిక్వెస్ట్ మేరకు ఫస్ట్ టీ20లు, తర్వాత టెస్ట్‌లు ఆడేందుకు ఇండియన్ బోర్డు అంగీకరించింది. ఈ లెక్కన ఈ నెల 24న ఫస్ట్ టీ20 లక్నోలో, 26, 27న ధర్మశాలలో తర్వాతి టీ20లు జరుగుతాయి. అక్కడి నుంచి రెండు టీమ్స్ మొహాలీకి వెళ్తాయి. ఫస్ట్ టెస్ట్‌కు (మార్చి 3–7) మొహాలీ ఆతిథ్యం ఇవ్వనుండగా, డే నైట్ అయిన సెకండ్ టెస్ట్ (మార్చి12–16) బెంగళూరులో జరగనుంది. ప్రస్తుతం కోహ్లీ 99 టెస్టులు కంప్లీట్ చేసుకున్నాడు. ఐపీఎల్ ఆర్సీబీ టీమ్ ద్వారా 14 ఏళ్లుగా తనకు అటాచ్‌మెంట్ ఉన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో, సొంత ఫ్యాన్స్ ముందు వందో టెస్ట్ ఆడాలన్న ఆశతో ఉన్నాడు. కానీ, లంక టూర్ షెడ్యూల్‌ను బోర్డు మార్చడంతో విరాట్‌కు నిరాశ తప్పలేదు.
