Mohammad Rizwan: చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. కోహ్లి, బాబర్ ఆజం రికార్డు బద్దలు

Mohammad Rizwan: చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. కోహ్లి, బాబర్ ఆజం రికార్డు బద్దలు

ఓవైపు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో బిజీగా ఉండగా.. మరోవైపు పాకిస్తాన్ బ్యాటర్లు అతని అంతర్జాతీయ రికార్డులు బద్దలు కొట్టే పనిలో ఉన్నారు. పాక్ వికెట్ కీపర్/ ఓపెనర్ మ‌హ్మద్ రిజ్వాన్ చ‌రిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3వేల ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో అతను ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి, పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాంల‌ రికార్డును అధిగమించాడు. రావ‌ల్పిండి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో అత‌ను ఈ ఘ‌న‌త సాధించాడు.

అంత‌ర్జాతీయ టి20 క్రికెట్‌లో 3000 పరుగులు చేరుకోవడానికి విరాట్ కోహ్లి, బాబర్ ఆజాంలలు 81 ఇన్నింగ్స్‌ల  చొప్పున తీసుకోగా.. రిజ్వాన్  79 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించాడు. 

అంత‌ర్జాతీయ టీ20ల్లో వేగంగా 3వేల ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు

  • మ‌హ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్‌): 79 ఇన్నింగ్స్‌లు
  • విరాట్ కోహ్లి (భార‌త్‌): 81 ఇన్నింగ్స్‌లు
  • బాబ‌ర్ ఆజాం (పాకిస్తాన్‌): 81 ఇన్నింగ్స్‌లు
  • ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా): 98 ఇన్నింగ్స్‌లు
  • మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్‌): 101 ఇన్నింగ్స్‌లు

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. రెండో టీ20లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 18.1 ఓవ‌ర్ల‌లో 98 ప‌రుగుల‌కే ఆలౌటైంది. అనంతరం పాక్ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని 12.1 ఓవ‌ర్ల‌లోనే చేధించారు. ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఈ ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 వ‌ర్షం కార‌ణంగా రద్దయ్యింది.