
కౌడిపల్లి, వెలుగు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ ను తొలగించాలని కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గురువారం గ్రామ పంచాయతీ వద్ద కార్యదర్శిని నిలదీసి, పంచాయతీ ఆఫీస్కు తాళం వేసి కౌడిపల్లిలోని ఎంపీడీవోకు తాళం అప్పగించారు. గ్రామంలో నాలుగు రోజుల నుంచి తాగునీటి సమస్య ఉందని, రెండు రోజులకు ఒకసారి మంచినీరు రాకపోవడంపై గ్రామస్తులు కార్యదర్శిని నిలదీయగా ఏదో ఒక సాకు చెప్పి ప్రజలను బెదిరిస్తున్నాడని ఆరోపించారు.
మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ కావాలంటే డబ్బులు వసూలు చేస్తున్నారని, పెన్షన్ తీసుకునే వృద్ధుల నుంచి సైతం డబ్బులు వసూలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో ప్రైవేట్ పనులు చేయిస్తున్నట్టు ఆరోపించారు. గ్రామ పంచాయతీకి వచ్చి మధ్యాహ్నం సమయంలో దర్జాగా ఆఫీసులోనే బెంచిపై నిద్రిస్తూ డోర్ లాక్ చేసుకుని పడుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. అదేంటని గ్రామస్తులు వెళ్లి ప్రశ్నిస్తే మీకు అవసరం లేదు లోపలికి వచ్చే అర్హత కూడా లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని బెదిరిస్తున్నాడని తెలిపారు.