
- ప్రకటించిన బీజేపీ హైకమాండ్
- స్పీకర్‌గా తోమర్ ఎన్నిక
భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ పేరును బీజేపీ హైకమాండ్ సోమవారం ఫైనల్ చేసింది. భోపాల్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌లో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. మోహన్ యాదవ్‌ను సీఎంగా ప్రకటించడంతో పలువురు ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 58 ఏండ్ల మోహన్ యాదవ్.. ఉజ్జయిని సౌత్ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2013 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజేంద్ర శుక్లా (రేవా నియోజకవర్గం), మాజీ మంత్రి జగదీశ్ డియోరా డిప్యూటీ సీఎంలుగా ఉంటారు. పార్టీ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరిస్తారు. సీఎం పోస్టుకు మోహన్ యాదవ్ పేరును మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిఫార్సు చేసినట్లు ఆ పార్టీ లీడర్ కైలాష్ విజయ్ వర్గీయ తెలిపారు.
సీఎం పదవికి చౌహాన్ రాజీనామా
సీఎం మోహన్ యాదవ్ సోమవారం సాయంత్రం గవర్నర్ మంగుభాయ్ సి పటేల్‌ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. కాగా, శివరాజ్‌సింగ్ చౌహాన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. యాదవ్‌కు అభినందనలు తెలిపారు. మోహన్ యాదవ్ ఇంటి వద్ద కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
మోదీ లీడర్‌షిప్‌లో పనిచేస్తా: మోహన్ యాదవ్
సీఎంగా అవకాశం ఇవ్వడంపై మోహన్ యాదవ్ స్పందించారు. ఎంతో నమ్మకంతో సీఎం బాధ్యతలు అప్పగించినందుకు బీజేపీ హైకమాండ్ ధన్యవాదాలు చెప్పారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తాను’ అని యాదవ్ చెప్పారు.
మోహన్ యాదవ్ ప్రొఫైల్
మోహన్ యాదవ్.. 25 మార్చి, 1965లో ఉజ్జయినిలో పూనమ్ చంద్, సీమా యాదవ్ దంపతులకు పుట్టారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ, ఎంఏ, ఎంబీఏ, పీహెచ్డీ చదివారు. 1982లో పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా పనిచేశారు. 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి తొలిసారి గెలిచారు. 2018లో గెలిచి విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. తాజాగా సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు.