
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను అందజేసి, అభినందనలు తెలియజేశారు. 2023 సంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేశారు. ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మస్సే (ట్వల్త్ ఫెయిల్), ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) అవార్డులను అందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘ట్వల్త్ ఫెయిల్’ చిత్రం నిలిచింది.
తెలుగు వెలుగులు
తెలుగు సినిమాలకు ఏడు కేటగిరీస్‌లో అవార్డులు లభించాయి. ‘బలగం’ చిత్రంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రాసిన ‘ఊరు పల్లెటూరు’ పాటకుగాను ఉత్తమ గీతరచయితగా కాసర్ల శ్యామ్ అవార్డును స్వీకరించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఎంపిక కాగా, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి అవార్డులు అందుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ జెట్టి వెంకట్ కుమార్ ‘హనుమాన్’ చిత్రానికి ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులను స్వీకరించారు.
అదే చిత్రానికి బెస్ట్ యాక్షన్ విభాగంలో స్టంట్ కొరియోగ్రాఫర్లు నందు, పృధ్వి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ‘యానిమల్’ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో నేషనల్ అవార్డు అందుకున్నారు. అలాగే ‘బేబీ’ చిత్రానికిగాను ఉత్తమ స్ర్కీన్‌ప్లే రైటర్‌గా సాయి రాజేష్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా పీవీఎన్‌ఎస్ రోహిత్ అవార్డులు తీసుకున్నారు. అలాగే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘గాంధీతాత చెట్టు’ చిత్రానికిగాను దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి అవార్డును పొందారు.
ఫాల్కే అవార్డును అందుకున్న మోహన్‌లాల్
మలయాళ స్టార్ మోహన్ లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ ‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ఈ ప్రెస్ట్రీజియస్ అవార్డును అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. కేరళ స్టేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రెండో వ్యక్తిగా నాకు ఆనందంగా ఉంది. ఈ అవార్డు నా ఒక్కడికే సొంతం కాదు. యావత్ మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందుతుంది. ఇది నాకు డ్రీమ్ కమ్ ట్రూలా అనిపించడం లేదు. ఇదొక మ్యాజిక్‌లా అనిపిస్తుంది. దీంతో మరింత బాధ్యతగా పనిచేస్తా’ అని చెప్పారు.
తెలుగు వాడిగా గర్విస్తున్నా: కాసర్ల శ్యామ్
తెలంగాణ సంస్కృతిని, పల్లె స్వచ్ఛతను చాటిచెప్పిన ‘ఊరు పల్లెటూరు’పాట జాతీయ స్థాయిలో తనకు గుర్తింపును తెచ్చిపెట్టడం పట్ల తెలుగు వాడిగా గర్వపడుతున్నానని రచయిత కాసర్ల శ్యామ్ అన్నారు. రాష్ట్రపతిని ఒకసారైనా కలవాలని కోరిక ఉండేదని, అలాంటిది వారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది తన జీవితంలో మరపురాని ఘట్టమని, కలలో కూడా ఊహించలేదని చెప్పారు.