
సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు వెద్దజల్లుతున్నాయి పార్టీలు. లిక్కర్ ను సరఫరా చేస్తున్నారు. ఎన్నికల అధికారుల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 3 వందల 77 కోట్ల 51 లక్షల రూపాయలు సీజ్ చేశారు. 157 కోట్ల విలువైన లిక్కర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 705 కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు అధికారులు.
ఉత్తరాధితో పోల్చోతే సౌతిండియాలో నగదు పంపిణీ ఎక్కువగా ఉంది. కర్ణాటక,తమిళనాడులో నోట్ల కట్టలు గుట్టలుగా బయడపడుతున్నాయి. ఐటీ సోదాల్లోనూ కోట్లాది రూపాయలు దొరుకుతున్నాయి. నిన్న పెరంబూరులో డీఎంకే నేతల కారును తనిఖీ చేయగా రెండు కోట్ల రూపాయలు దొరికాయి. కర్ణాటకలోనూ భారీగా నగదు, లిక్కర్ పట్టుబడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ కాన్వాయ్ లో కోటి 80 లక్షల రూపాయలు దొరకడం కలకలం రేపింది. సీఎం కారులో డబ్బు దొరికినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది.
ఇక మన రాష్ట్రంలోనూ ధన ప్రవాహం జోరుగా సాగుతోంది. అధికారుల తనిఖీల్లో కోట్లాది రూపాయలు దొరుకుతున్నాయి. రాత్రి హైదరాబాద్ లో రెండు కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. జయభేరి ప్రాపర్టీస్ లో పని చేస్తున్న నిమ్మలూరి శ్రీహరి, ఆరుటి పండరిగా పోలీసులు గుర్తించారు. ఈ నగదు రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ కోడలు.. మాగంటి రూప కోసం తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారుల తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ లేడీస్ హాస్టల్ లో 70 లక్షల రూపాయలు పట్టుకున్నారు. ఇన్ ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో అధికారులు దాడి చేసి నగదు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో కారులో తరలిస్తున్న నలెక్కలు లేని 39 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు.