మన ‘స్విస్​ సొమ్ము’లు తగ్గుతున్నయ్

మన ‘స్విస్​ సొమ్ము’లు తగ్గుతున్నయ్
  • నల్లడబ్బు దాచుకుంటున్న దేశాల జాబితాలో 74వ స్థానం
  • మొత్తం నల్లడబ్బులో ఇండియా వాటా కేవలం 0.07 శాతం
  • టాప్​లో బ్రిటన్​.. ఆ దేశం వాటానే 26.26 లక్షల కోట్లు
  • స్విస్​ బ్యాంకుల్లోని అన్ని దేశాల నల్ల డబ్బు ₹99 లక్షల కోట్లు

విదేశాల్లో దాచుకున్న నల్లడబ్బును ఇండియాకు తిరిగి తెప్పిస్తాం.. ఇదీ 2014 ఎన్నికలప్పుడు ప్రధాని మోడీ ఇచ్చిన ప్రధాన హామీ. మరి, అన్న మాటను ఆయన నిలుపుకున్నారా అంటే.. ఏమోగానీ, నల్లడబ్బు దాచుకోవడం మాత్రం చాలా వరకు తగ్గింది. చాలా పెద్ద దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలోనే ఇండియా ఉంది. అయితే, పక్కదేశాలైన పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ల కన్నా తక్కువ స్థాయిలో నిలిచింది. స్విస్​ బ్యాంకుల్లో ఇండియన్లు దాచుకుంటున్న నల్లడబ్బు విషయంలో ఇండియా 74వ స్థానానికి తగ్గింది. గత ఏడాది 73వ స్థానంలో ఉంది. అయితే, 2017లో 88వ స్థానంలో ఉన్న ఇండియా గత ఏడాది 73వ స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు ఒక స్థానం తగ్గింది. ఇక, ఈ జాబితాలో బ్రిటన్​ టాప్​ ప్లేస్​లో నిలిచింది.

స్విస్​ నేషనల్​ బ్యాంక్​ (ఎస్​ఎన్​బీ) విడుదల చేసిన వార్షిక బ్యాంకింగ్​ గణాంకాల్లో ఈ విషయం తేలింది. స్విస్​ బ్యాంకుల్లో దాచిన అన్ని దేశాల డబ్బుల్లో ఇండియాది కేవలం 0.07 శాతం. అత్యధికంగా బ్రిటన్​కు చెందిన ఆస్తులే 26 శాతం ఉన్నాయి. బ్రిటన్​ తర్వాతి స్థానాల్లో అమెరికా, వెస్టిండీస్​, ఫ్రాన్స్​, హాంకాంగ్​లు టాప్​5లో స్థానాన్ని దక్కించుకున్నాయి. స్విస్​ బ్యాంకుల్లో దాచుకున్న ఆ ఐదు దేశాల సంపదే 50 శాతం. అంటే సగం. టాప్​ 10 దేశాల సంపద 66 శాతం కాగా, టాప్​ 15 దేశాల సంపదే 75 శాతంగా ఉంది. టాప్​ 30 దేశాల సంపద 90 శాతం వరకు ఉంది. టాప్​ 10లో హాంకాంగ్​ తర్వాత బహామాస్​, జర్మనీ, లక్సెంబర్గ్​, కేమాన్​ ఐలాండ్స్​, సింగపూర్​లున్నాయి. బ్రిక్స్​ కూటమిలోని దేశాల జాబితాలో ఇండియానే అన్నింటి కన్నా తక్కువగా ఉంది. ఈ జాబితాలో రష్యా టాప్​లో ఉండగా, మొత్తంగా 20వ స్థానంలో నిలిచింది. నల్లడబ్బు విషయంలో ఇండియా కన్నా ముందు చాలా పెద్ద దేశాలున్నాయి.

మనకన్నా పక్క దేశాలే నయం

వేరే పెద్ద దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నా పక్క దేశాలతో పోలిస్తే తక్కువ స్థాయిలోనే ఉన్నాం. పాకిస్థాన్​, బంగ్లాదేశ్​లు మనకన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. పాక్​ 82వ స్థానంలో ఉంటే, బంగ్లాదేశ్​ 89వ ర్యాంకు దక్కించుకుంది. నేపాల్​ 109, శ్రీలంక 141, మయన్మార్​ 187, భూటాన్​ 193లు మనకన్నా మంచి స్థానంలో ఉన్నాయి. నల్లడబ్బు విషయంలో నాలుగేళ్లలో ఇండియా కన్నా పాకిస్థాన్​ మెరుగ్గా ఉండడం ఇదే తొలిసారి. బ్యాంకింగ్​ రహస్యాలపై స్విట్జర్లాండ్​ కొంచెం కఠిన నిబంధనలు పెట్టడంతో విదేశాల నుంచి నల్లడబ్బు ప్రవాహం చాలా వరకు తగ్గింది. ఏటా ఈ లెక్కలను ఎస్​ఎన్​బీ విడుదల చేస్తున్నా, వాటిలో ఎన్​ఆర్​ఐలు దాచుకుంటున్న వివరాలను మాత్రం కలపదు. 2004లో స్విస్​బ్యాంకుల్లోని నల్లడబ్బుల విషయంలో ఇండియా 34వ స్థానంలో ఉండేది. 2007 వరకూ టాప్​ 50లో ఉంది. ఇప్పుడు అది మెల్లమెల్లగా తగ్గుతోంది. 2008లో 55, 2009, 2010లో 59, 2011లో 55, 2012లో 71, 2013లో 58వ స్థానంలో ఉంది. 2018లో స్విస్​ బ్యాంకుల్లో ఇండియన్లు దాచుకున్న నల్లడబ్బు 6 శాతం తగ్గింది. అంటే ₹6757 కోట్లు తగ్గింది. ప్రస్తుతం     స్విస్​ బ్యాంకుల్లో అన్ని దేశాల నల్లడబ్బు విలువ అక్షరాల 99 లక్షల కోట్ల రూపాయలు. అందులో బ్రిటన్​ వాటా 26.26 లక్షల కోట్ల రూపాయలు. ఆ తర్వాత అమెరికా అక్రమ సంపాదన 10.16 లక్షల కోట్ల రూపాయలు.