
- చంపిన ఇద్దరూ గతంలో రైల్వే ఉద్యోగులే
కాజీపేట, వెలుగు: రైల్వేలో ఉద్యోగాలు చేస్తూ నేరాలకు పాల్పడుతున్న జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన వడ్డీ వ్యాపారి త్రిపురాది నవీన్ కుమార్(55) హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నేర చరిత్రను బయటపెట్టారు. కాజీపేట ఏసీపీ పింగలి ప్రశాంత్ రెడ్డి, సీఐ వై సుధాకర్ రెడ్డి, ఎస్సై నవీన్ కుమార్‌తో కలిసి మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వడ్డీ వ్యాపారి నవీన్ కుమార్ కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్ లో పని చేసే గడ్డం ప్రవీణ్ కుమార్ కు రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులు ఇస్తానని చెప్పి ప్రవీణ్ కుమార్ తన రైల్వే క్వార్టర్ కు గత నెల 27న మధ్యాహ్నం నవీన్ కుమార్ ను ఇంటికి పిలిపించుకున్నాడు.
ఇద్దరు మద్యం తాగి మాటల్లో ఉండగా, నవీన్ కుమార్ ను బెల్టుతో లాగి కిందపడేసి, బండ రాయితో తలపై కొట్టాడు. ప్రవీణ్‌కుమార్ కు అతనితో సహజీవనం చేస్తున్న గుండా రజని సహకరించింది. వాహనదారులు ఎవరూ రాకపోవడంతో క్వార్టర్‌లోనే డెడ్ బాడీని వదిలేసి, నవీన్ కుమార్ ఒంటిపై ఉన్న 15.5 గ్రాముల బంగారు నగలతో పరారయ్యారు. మంగళవారం ఉదయం కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి దగ్గర వాహనాల తనిఖీలు చేస్తుండగా ప్రవీణ్‌కుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడు ఇచ్చిన సమాచారంతో యాదాద్రిభువనగిరి జిల్లా మర్రిగూడెంలో తలదాచుకున్న రజనీని అరెస్ట్ చేసి తీసుకువచ్చామని ఏసీపీ తెలిపారు. వారి నుంచి 15.5 గ్రాముల బంగారం, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్‌కు పంపిస్తామని తెలిపారు.
ఇద్దరూ నేరస్తులే..
కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో గడ్డం ప్రవీణ్‌కుమార్ గ్రేడ్–3 టెక్నీషియన్ గా, రజనీ గ్రేడ్–1 టెక్నీషియన్ గా పని చేసేవారు. భార్య ఆత్మహత్య కేసులో ఉద్యోగం కోల్పోయిన ప్రవీణ్‌కుమార్ ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. రజనీ ఉద్యోగం కోల్పోయింది. లోకోషెడ్ లో పని చేస్తున్న వీరిద్దరూ 2013 నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్ భార్య రేణుక 2018లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో వీరిద్దరూ జైలుకు వెళ్లి వచ్చారు. అలాగే పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇటుక బట్టీ ఓనర్ నల్లూరి సిద్దయ్యను కిడ్నాప్ చేసి రూ.8 లక్షలు వసూలు చేసిన కేసులో, నకిలీ నోట్ల చలామణీ కేసులో ఇద్దరిపై పాలకుర్తి, సుబేదారి, మట్టెవాడ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, జైలుకు పోయారు. భార్య లేని ప్రవీణ్‌కుమార్, భర్త లేని రేణుక జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ తెలిపారు.